ఆశ్రమ పాఠశాలలో వసతుల తనిఖీ
గోదావరి వరదల నివారణకు శాశ్వత రక్షణా చర్యలు
ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటన
గోదావరి కరకట్టకు పటిష్ట చర్యలపై పరిశీలన
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటీడీఏ
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో కలిసి తనిఖీ చేశారు. పాఠశాలలు పున్ణప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్‌కు నూతనంగా చేరిన విద్యార్థినుల పరిస్థితులను పరిశీలించి, మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను, వారి సమస్యలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు నాణ్యంగా ఉండేలా చూడాలని, ప్రభుత్వ వసతి గృహాల్లో పరిశుభ్రత, భోజన నాణ్యత, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, వారికి అంది స్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
అనంతరం మంత్రి సీతక్క అధికారులతో కలిసి రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్ పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. వరద ఉధృతి గ్రామాలైన రామన్న గూడెం, మంగపేట ప్రాంతాల్లో వరద ప్రభావం చూపకుండా దేశంలోని అత్యాధునిక సాంకేతికతతో జియో ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత రక్షణ చర్యలను చేపడుతున్నట్టు చెప్పారు. అధికారులు వరద పరిస్థితులపై పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పిరంగి, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి, ఐబీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కమిటీల చైర్మెన్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



