‘సంచార జాతులవాళ్లం.. ఆరేండ్లుగా ఇక్కడే ఉంటున్నాం..
ఆశ్రయం కల్పించండి’ అంటూ బాధితుల ఆవేదన
పోలీసుల పహారాలో ‘హెచ్‌ఎండీఏ’ కూల్చివేతలు
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఆరేండ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడే నివాసం ఉంటున్నామని, సంచార జాతుల వాళ్లమన్న కనికరం లేకుండా తమ గుడిసెలను అన్యాయంగా తొలగించారంటూ పేదలు బోరున విలపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 125/93 లో గుండు మల్లన్న ఆలయం పక్కన గంగిరెద్దుల సంచార జాతుల వాళ్లు ఆరేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. గురువారం పోలీస్ పహారా ల్లో హెచ్‌ఎండీఏ అధికారులు వచ్చి అక్కడున్న 15 నుంచి 25 గుడిసెలను జేసీబీలతో కూల్చివేశారు. దాంతో బాధితులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరై తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఊరురా తిరిగే తమకు ఆశ్రయం కల్పించాలని వేడుకున్నా అధికారులు కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ ఓట్లను వాడుకొని గద్దెనెక్కిన తర్వాత నాయకులు తమకు నిలువ నీడ చూపకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నేండ్లుగా ఉంటున్నా ఎప్పుడు ఏ అధికారి ఇక్కడికి రాలేదని, ఇప్పుడు హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం భూమి తమదంటూ తాము నివాసం ఉంటున్న గుడిసెలను నేలమట్టం చేస్తే తాము ఎక్కడ బతకాలని ప్రశ్నించారు. గొడ్డు, గోదా, పిల్ల జెల్లలతో ఉంటున్న తాము ఉన్నపళంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామని, తమకు దిక్కెవరి కన్నీమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే ఇక్కడ గుడిసెల్లో నివాసం ఉంటున్న కొందరి ఇండ్లకు ఇంటి నంబర్ ఉండటంతో వారి వద్ద నుంచి అధికారులు ఇంటి పన్ను వసూలు చేయడం గమనార్హం. ప్రభుత్వ అధికారులే ఒకవైపు పన్నులు వసూలు చేస్తూ మరోవైపు నివాసాలను కూల్చివేతలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కూల్చివేతల సమయంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటాన్ చెరు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పేదల గుడిసెల తొలగింపు అన్యాయం : సీపీఐ(ఎం) పటాన్‌చెరు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు
చెరువు పారిశ్రామిక ప్రాంతంలో వందల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని అధికారులు.. పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం ఆగమేఘాల మీద కూల్చివేతలకు పూనుకోవటం సమంజసం కాదు. వారికి వెంటనే ఇండ్లు కేటాయించాలి. లేనిచో వారి పక్షాన సీపీఐ(ఎం) పోరాడుతుంది.



