Friday, May 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు

- Advertisement -

మిత్రులారా… హైదరాబాద్‌కు రావడం అంటే నాకు ఎప్పుడూ సంతోషమే. భారతీయ భావనను హైదరాబాద్ నగరం అర్థం చేసుకున్నంత సమగ్రంగా మరో నగరం అర్థం చేసుకోలేదనుకుంటాను. హైదరాబాద్ నగరం ఎన్నడూ సంకుచితమైన అడ్డుగోడలు కట్టుకోలేదు. ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారతదేశానికి, ఉర్దూకి, తెలుగుకి, బిర్యానీకి, సాంకేతిక పరిజ్ఞానానికి ఆలవాలమైన హైదరాబాద్ నగరం మరోవైపు పాతకాలపు రాజసానికి, ఆధునిక విశ్వపు ఆశాజ్యోతులకు ప్రతినిధ్యం వహిస్తోంది. భారత కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రతిభావంతమైన పార్లమెంటరీ నాయకుడు, సమగ్ర భారతీయుల హక్కులు, ఆకాంక్షల కోసం నిలదీసిన ప్రతిభాశాలి కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య నలభై ఒకటో స్మారక ఉపన్యాసం వెలువరించే అవకాశం దక్కడం నాకు విశిష్టమైన గౌరవంగా భావిస్తున్నాను.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదని సుందరయ్య ప్రగాఢ అభిప్రాయం. ప్రజాస్వామ్యం అంటే ఉన్న వ్యవస్థలు నిస్సహాయులకు ఆసరాగా ఉన్నాయా? లేవా? అన్నదే సుందరయ్య ఎంచుకున్న ప్రమాణం. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, సామాజిక సమానత్వం కోసం, వ్యవస్థ చేత విస్మరించ బడిన వారి ఆత్మగౌరవం కోసం పోరాడారు. నేడు దేశం ముందున్న ప్రశ్న మీ ముందుంచుతున్నాను. సామాజిక స్వభావపు నిష్పక్షపాతాన్ని, ప్రజాతంత్ర యుతమైన సమాన త్వాన్ని సాధించడానికి భారతదేశం ఏమి చేస్తుంది అన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకుని దీనికి సమాధానం కోసం సుందరయ్య గారు ఎంతో నిబద్ధతతో ప్రయత్నం చేసేవారు. ఆయననుసరించిన సాంప్రదాయానికి, అవగాహనకు కొనసా గింపుగా ఈ స్మారక ఉపన్యాసం ఉంటుందని విశ్వసిస్తున్నాను.

భారతదేశపు సమాఖ్య స్వభావాన్ని ప్రభావితం చేయనున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గురించి చర్చించడానికి హైదరాబాద్ సరైన వేదిక అనుకుంటున్నాను. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనగానే సభకు వచ్చిన వారిలో సగం మంది లేచి వెళ్లేవారు. అదేదో రాజ్యాంగ నిపుణులైన న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన అధికారులూ, నాలాంటి ఎన్నికల సంఘం ప్రతినిధులకు మాత్రమే సంబంధించిన విషయంగా భావించ బడుతూ ఉండేది. ఉన్నట్టుండి ఇది రాజకీయ విస్ఫోటనంగా మారింది. చట్టసభల్లోనూ, టెలివిజన్ స్టూడియోల లోనూ, మేధో సెమినార్లలోనూ ప్రధానమైన చర్చనీయాంశంగా తయారైంది. అనధికారికంగా దక్షిణ భారతదేశంలో సాధారణ రాజకీయ పరిభాషలో భాగమైంది. ఎందువలన? ఎందుకంటే అనేక దక్షిణాది రాష్ట్రాలు తాము సాధించిన విజయాలే తమకు శాపంగా మారబోతున్నాయని ఆందోళన చెందుతున్నాయి.

విద్య, వైద్యం, జనాభా నియంత్రణ వంటి మానవ వనరుల అభివృద్ధికి దోహదం చేసే అనేక అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించిన ఈ రాష్ట్రాలు కేవలం తాము జాతీయ లక్ష్యాలను…సాధించినందుకు, ప్రయోజనాలను నెరవేర్చినం దుకు నేడు పార్లమెంటులో తగినంత ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇది దేశం మొత్తంగా చర్చించాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన వైరుధ్యం.అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు కూడా మరో మౌలికమైన ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఎప్పుడో సేకరించిన జనాభా లెక్కలపై ఆధారపడి భారతదేశంలో ప్రాతినిధ్యాన్ని నిర్ణయించడం ఇంకా ఎంతకాలం కొనసాగు తుంది అన్నది ఆ ప్రశ్న. నేటి భారతదేశపు జనాభా 150 కోట్లు. 54 కోట్ల 80 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు నిర్ణయించిన ప్రాతినిధ్య వ్యవస్థనే నేటికీ కొనసాగించాలా అన్నది ఈ ప్రశ్న యొక్క సారాంశం.

ఈ రెండు ప్రశ్నలకు ప్రజాతంత్రయుతమైన స్వభావం ఉంది. అందువల్లనే ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం సాంకేతిక పరమైన కసరత్తుగా మిగిలిపోలేదు. భవిష్యత్ భారతంలో సమ ప్రాతినిధ్యం గురించిన సమస్య ఇది. ఇదేదో ఉత్తర–దక్షిణ భారత దేశాల మధ్య ఉన్న వివాదంగా, ఘర్షణగా చూడకూడదు. ఈ సమస్యపై చర్చను ఆ రకంగా కుదించడం ప్రమాదకరమైనది. నిష్ఫలమైనది కూడా. విశాలమైన సమాఖ్య రాజ్యం ఏదైనా రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా ప్రాతినిధ్యం మధ్య సమన్వయం ఎలా సాధించాలి అనే సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దాదాపు యాభైఏళ్ల పాటు భారతదేశం ఈ సమస్యను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటివరకు విజయప్రదంగా ఈ సమన్వయ ప్రాథమిక సమస్యను అధిగమిస్తూ వచ్చింది.

గిడస బారిన చిత్రపటం
భారత పార్లమెంట్ చిత్రపటం నేటికీ 1971 నాటి జనగణన ఆధారంగానే కొనసాగుతోందన్న విషయాన్ని చాలామంది విస్మరిస్తారు. 1976 నుండి వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రాతినిధ్యం స్థిరంగా ఉంది. ఏదో దురదృష్టవశాత్తూ జరిగినది కాదు. ఇది చైతన్యపూర్వకంగా తీసుకున్న రాజకీయ నైతిక నిర్ణయం. ప్రాతినిధ్యాన్ని జనసంఖ్యతో ముడిపెడితే జనాభా నియంత్రణ లక్ష్యాలను పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాతినిధ్యం విషయంలో నష్టం జరుగుతుందని భారతదేశం గుర్తించింది. అందువలన నియోజకవర్గాల పునర్వ్యవస్థీక రణను 2001 సంవత్సరం వరకు నిలిపివేయాలని పార్లమెంట్ నిర్ణయించింది. తరువాత 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిలుపుదలను 2026 సంవత్సరం తరువాత జరిగే మొదటి జనగణన వరకు కొనసాగించాలని నిర్ణయించింది.

దక్షిణ భారత రాష్ట్రాల ఆందోళన
దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళన న్యాయ మైనది, హేతుబద్ధమైనది, రాజ్యాంగబద్ధమైనది. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్ణయించిన లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు ముందుగానే సాధించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయింది. మహిళల అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ విస్తరించింది. కేంద్ర ప్రభుత్వం పదే పదే రాష్ట్రాల ముందు పెట్టిన లక్ష్యాలు ఇవే. వీటిని దక్షిణాది రాష్ట్రాలు సాధించాయి. అమలు చేశాయి.

ఇక్కడే వైచిత్రి మొదలవుతుంది
జాతీయస్థాయిలో సగటు సంతానోత్పత్తి రేటు 2.1 శాతం ఉంటే తమిళనాడులో అది 1.8 శాతం మాత్రమే. ఎంతో పురోగతి సాధించిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లో నేటికీ సంతానోత్పత్తి రేటు 2.7శాతంగా ఉంది. జాతీయ సగటు కంటే ఎక్కువ. వివిధ రాష్ట్రాల్లో గత యాభైఏళ్లలో ఈ వైవిధ్యం గణనీయంగా పెరిగింది. ఆయా రాష్ట్రాలు అనుసరించిన జనాభా నియంత్రణ విధానాల్లోని వైవిధ్యాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ కేవలం జనాభా సంఖ్యతో ముడిపెడితే అది రాజకీయ అధికారంలో ప్రతిబింబిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల నేతలు సంకుచిత స్వభావులు కారు. వాళ్లు వేసేది చిల్లర ప్రశ్నలు కాదు. ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పాటుపడిన రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించడం న్యాయమేనా అన్నది వారి ప్రశ్న. దీనిని ప్రాంతీయ భావోద్వేగంగా పరిగణించి కొట్టి పారేయటానికి లేదు. ముఖ్యమైన జాతీయ సమస్యగా పరిగణించాలి.

పునర్వ్యవస్థీకరణ తరువాత దక్షిణాది రాష్ట్రాలు ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా కోల్పోయే సమస్య లేదని ప్రధాని, కేంద్ర హోం మంత్రి హామీ ఇస్తున్నారు. దామాషా ప్రాతినిధ్యాన్ని కాపాడతామని చెబుతున్నారు. మొత్తంగా లోక్‌సభ సీట్లు 850కి పెరగనున్నాయని, అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు కూడా లాభం పొందనున్నాయని అంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు 80 నుండి 120కి పెరిగే అవకాశం ఉన్నట్లే తమిళనాడులో కూడా 39 నుండి 60కి పెరిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ జనాభా పరమైన ఆధిపత్యానికి దారితీయదని చెబుతున్నారు.కానీ పార్లమెంటరీ రాజకీ యాలు కేవలం నిష్పత్తుల ఆధారంగా జరగవు. అసలైన ఓటింగ్ బలం ఆధారంగానే సాగుతాయి.ప్రస్తుతం తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల మధ్య లోక్‌సభ సీట్ల వ్యత్యాసం 40. విస్తరించిన తరువాత ఉనికిలోకి వచ్చే లోక్‌సభలో ఈ తేడా 60కి పెరుగుతుంది. పార్లమెంటులో ఓటింగ్ జనాభా మోతాదుల ప్రకారం జరగదు. ఎన్ని ఓట్లు పడితే అన్నీ లెక్కవుతాయి. ఒక ఓటుకు ఒక విలువ లెక్కగా ఉంటుంది.ఈ గణాంకాలే సంకీర్ణ రాజకీయాలను, మంత్రివర్గ ఏర్పాట్లను, రాజ్యాంగ సవరణలను ప్రభావితం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే భారత సమాఖ్య రాజకీయ స్వభావాన్ని నిర్ణయిస్తాయి. గణిత మోతాదుల్లో సమానత్వాన్ని వెతకవచ్చు కానీ రాజకీయాల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఉంటుంది.

ప్రత్యామ్నాయాలు
అనేక ప్రత్యామ్నాయాలు గురించి ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. మొదటి ప్రత్యామ్నాయం- వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ఒకే స్థాయికి చేరేంత వరకు పునర్వ్యవస్థీకరణను వాయిదా వేయడం.విధాన నిర్ణేతలు అంచనా వేసినదానికంటే వేగంగానే వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి సామర్థ్యంలో వ్యత్యాసాలు తగ్గిపోతున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణను మరో పది, పదిహేను సంవత్సరాలు వాయిదా వేయగలిగితే వివిధ రాష్ట్రాల్లోని జనాభా వ్యత్యాసాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఇది అనుసరణీయమే అయినా కొంత భారం ఉంటుంది. యాభై ఏళ్లనాటి జనగణన ఆధారంగా ఇప్పటి ప్రాతినిధ్యాన్ని నిర్ణయించడం సమంజసం కాదు. రెండో ప్రత్యామ్నాయం-మిశ్రమ ప్రాతినిధ్యం. ఒకవైపు సమర్థవంతంగా పరిపాలన చేయడం ద్వారా సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూనే, మరోవైపు జనాభాకు కూడా తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యం ఇస్తూ మిశ్రమ నమూనాను అభివృద్ధి చేయడం. మూడో ప్రత్యామ్నాయం- దశలవారీగా పునఃపంపిణీ. అంటే పునర్వ్యవస్థీకరణ చట్టం ఆదేశాలను ఒకేసారి అమలు చేసి నాటకీయ ఫలితాలకు దారి తీయకుండా ఉండటానికి రెండు లేదా మూడు ఎన్నికల వరకు అంటే పది నుండి పదిహేను సంవత్సరాల వ్యవధిలో అమలు జరిగేలా వ్యూహాన్ని రూపొందించుకోవడం.

ఈ వ్యూహం తక్షణ రాజకీయ ఆందోళనలకు, విభేదాలకు అవకాశం ఇవ్వకుండా మారుతున్న వ్యవస్థకు ప్రజలను, రాజకీయ పార్టీలను సిద్ధం చేయటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా క్రమానుగతంగా రూపొందించి అనుసరించిన వ్యూహాలు భారత సమాఖ్య వ్యవస్థను మరింత పటిష్టం చేశాయని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేవలం ముడి గణాంకాలపై మాత్రమే ఆధారపడకుండా ఓపికగా, సున్నితంగా వ్యవహరించినందువల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విజయప్రదం అయింది.ఈ మూడు ప్రత్యామ్నాయాల్లోనూ మిశ్రమ విధానాన్ని రూపొందించడం ద్వారా పునర్వ్యవస్థీకరణకు సిద్ధం కావడమే మెరుగైన ప్రత్యామ్నాయం అని నేను భావిస్తున్నాను. ఈ విధానం నిష్పాక్షికమైన సమాఖ్య స్వభావాన్ని గౌరవిస్తూనే ప్రజాతంత్ర ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తుంది.సుపరిపాలన సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుంటూనే రాజ్యాంగపరమైన శస్త్రచికిత్స అవసరం లేకుండా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.

రాజ్యసభ గురించి ప్రశ్న
ఈ చర్చ మొత్తంలో రాజ్యసభ గురించి చర్చ లేకపోవటాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో రాజ్యసభ అంటేనే రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటా నికి ఏర్పాటు చేసిన సభ. తద్వారా సమాఖ్య సూత్రాలను సంరక్షించే సభ. కానీ ఆచరణలో మన రాజ్యసభ ఆ లక్ష్యాల నుండి దూరంగా వెళ్లింది.ఉత్తరప్రదేశ్ నుండి 31 మంది సభ్యులు రాజ్యసభకు ఎన్నికైతే తమిళనాడు నుండి 18 మంది సభ్యులు ఎన్నికవుతున్నారు. పునర్వ్యవస్థీకరణ తరువాత లోక్‌సభలో వివిధ రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యలో వ్యత్యాసాలు పెరిగితే రాజ్యసభ పొందిక యథావిధిగా కొనసాగితే సమాఖ్య వ్యవస్థలో తలెత్తే లోటును పరిష్కరిం చడంలో విఫలం అవుతాం.ఈ పరిస్థితుల్లో సరైన రాజ్యాంగ విశ్లేషణ అవసరం. ఈ పునర్వ్యవస్థీకరణ భారతదేశానికి సంబంధించిన మరింత లోతైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. భారతదేశంలో ఇలాంటి దేశానికి ఏ తరహా సమాఖ్య ఉంటే ఉపయోగకరం అన్నదే ఆ ప్రశ్న. జనసంఖ్య ఆధారంగా జనాభా ఆధిపత్యం ఆధారిత వ్యవస్థ ఉండాలా? లేక సంఖ్యాపరమైన ఆధిపత్యానికి, ప్రాంతీయ విశ్వాసాలకు, జాతీయ సహజీవనానికి మధ్య సమన్వయం సాధించే ప్రజాతంత్ర సమాఖ్య ఉండాలా?

‘మీరు విజయవంతం అయ్యారు కాబట్టి మీ పలుకుబడి తగ్గుతుంది’ అని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు చెప్పకూడదు. ఇది రాజకీయంగా అవివేకమైనది. నైతికంగా సమర్థించుకోలేనిది. ఇదే విధంగా మారితే సుపరిపాలన రాజకీయంగా నష్టదాయకం అన్న సందేశాన్ని అన్ని రాష్ట్రాలకు చేరవేసే విధంగా ఉంటుంది.అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు కూడా – ‘నిరంతరం మీ జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి మీ ప్రాతినిధ్యం విలువ శాశ్వతంగా తగ్గిపోతుంది’ అని కూడా చెప్పకూడదు. ప్రతి పౌరుడికి ఒకే ఓటు, ఆ ఓటుకు ఒకే విలువ ఉన్నప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థకు చట్టబద్ధత, ప్రజామోదం ఉంటాయి. సమానమైన ప్రాధాన్యత కలిగిన ఈ రెండు వాదాల మధ్య సమన్వయం సాధించడానికి భారతదేశం నేడు దారి వెతకాల్సిన అవసరం ఉంది. అలాంటి దారి కూడా ఉంది. కాకపోతే దాన్ని సృజనాత్మకంగా, రాజకీయ నిబద్ధత, ధైర్య సాహ సాలతోనూ, పక్షపాతం లేని తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలంలో కలిగే జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసే విశాల దృక్పథంతోనూ ఆ దారిని చేరుకోవాల్సిన అవసరం ఉంది.

మార్గాంతరం
సంతులనం పునాది గా రూపుదిద్దుకున్నదే భారత రాజ్యాంగం. లోక్‌సభ జనసంఖ్యకు ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ సమాఖ్య తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థిక సంఘం సమానత్వానికి పెద్దపీట వేస్తుంది. భాషా విధానం వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని అక్కున చేర్చుకుంటూ ఎదిగింది. భారత దేశపు ప్రతిభాపాటవాలు కఠినమైన ఏకాత్మతపై కాక చర్చలు, సంప్రదింపుల ద్వారా సాధించిన ఏకాభిప్రాయం సహజీవన పునాదిగా అభివృద్ధి చెందాయి. పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి, సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రతిభాపాటవాలపైనే ఆధారపడాలి. సంతానోత్పత్తి ధోరణులు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే దారికి రానున్నాయి. ఈ పరిస్థితి మరొక కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. 10 – 15 ఏళ్లలో భారతదేశం సంఘర్షణాత్మక వైఖరిని అనుసరించే వివాదాస్పద మైన రాజ్యాంగ తుది ఘడియలతో పని లేకుండా పరస్పర చర్చలు, సంప్రదింపులతో కూడిన ఏకాభిప్రాయం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 2027 జనగణన భారతదేశంలో ఎంతమంది ఉన్నారో లెక్కిస్తుంది. అదే సమయంలో రాజ్యాంగ నిర్మాతల అవగాహనను, ఆదర్శాలను కూడా పరీక్షకు పెడుతుంది.

తెలివిగా సంయమనంతో వ్యవహరిస్తే ఈ పరిణామం ప్రాతినిధ్య వ్యవస్థల నిర్మాణంలో ఆధునిక శకానికి పునాదులు వేస్తుంది. సమాఖ్య స్వభావాన్ని, స్ఫూర్తిని సంరక్షించు కుంటుంది. తొందరపాటుతోనూ, హడావిడిగానూ నడిస్తే ప్రాంతీయ భావావేశాలకు, భావోద్వేగాలకు ఆజ్యం పోస్తూ గణతంత్ర సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది హేతుబద్ధమైన చర్చలకు సందర్భం. తీసుకునే వైఖరులు కఠిన నిర్ణయాల ముందే, ఎటువంటి సంప్రదింపులతో సంబంధం లేకుండా ప్రతిపాదనలు తయారు చేసే నేతృత్వపు మొండితనానికి ముందే, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి.
టీవీల్లో వాడిగా వేడిగా చర్చించుకోవడం ద్వారానో, పక్షపాతంతో కూడిన విజయదుందుభిల ద్వారానో ఈ సమస్యను పరిష్కరించలేము. 1976 నాటి రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందిన తరహాలో బహుళ పార్టీ సంప్రదింపులు, చర్చల ద్వారా ఏకభిప్రాయం సాధించడం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారానికి గల ఏకైక మార్గం. అప్పటి రాజకీయ నాయకత్వం జనాభా ఆధారిత సానుకూలతను పక్కనపెట్టి సమాఖ్య ప్రయోజనాలను కాపాడటానికి అడుగులు వేసింది. అటువంటి అనుభవాలు మనకు చాలానే ఉన్నాయి. జ్ఞానం సంపాదించాము, మేధస్సు ఉంది, వీటన్నింటిని ఉపయోగించు కోవడానికి కావాల్సిన రాజకీయ చిత్తశుద్ధి ఉందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న.

దేశం ముందున్న సవాలు ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌‌సభ స్థానాలు దక్కాలి అన్నది కాదు. భారత సమాఖ్యలో ప్రజాతంత్ర సమానత్వం, సుహృద్భావ సమాఖ్య నిర్మాణం సాధించగలమా లేదా అన్నది దేశం ఎదుర్కొంటున్న లోతైన ప్రశ్న. రానున్న దశాబ్దిని ప్రభావితం చేయనున్న రాజ్యాంగపరమైన ప్రశ్నలలో ఇదొకటి. ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే రాబోయే తరాలకు అందించబోయే భావి భారతాన్ని ఆవిష్కరిస్తుంది. భారతదేశం చేసిన వాగ్దానము దేశంలోని మారుమూలాల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ చేరాలని కామ్రేడ్‌ ‌సుందరయ్య తన జీవితాన్ని అంకితం చేశారు.లోతుగా పరిశీలిస్తే నేడు పునర్వ్యవస్థీకరణ గురించి మన చుట్టూ జరుగుతున్న సంవాద, ప్రతివాదాల సారాంశం కూడా ఇదే. భారతదేశంలో ఉన్న బహుళత్వాలు, వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రజాతంత్ర భారతం మన వాగ్దానాన్ని భారతీయులందరికీ అందేలా, చెందేలా నెరవేర్చ గలమా లేదా అన్నదే మన ముందున్న ప్రశ్న. ఆయన కృషిని, జీవితాన్ని, త్యాగాన్ని గుర్తుకు తెచ్చే ప్రశ్న. ఈ భారతదేశాన్ని 75 ఏళ్ల పాటు సమైక్యంగా నిలిపి ఉంచి ముందుకు నడిపించిన రాజ్యాంగపు స్ఫూర్తిని కాపాడేందుకు పునరంకితమవుదామని ఆశిస్తూ..

ధన్యవాదాలు..
(భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి)

ఎస్‌.వై. ఖురేషి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -