Friday, May 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభరోసా లేని బతుకు

భరోసా లేని బతుకు

- Advertisement -

‘‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం’’ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అదే చిత్రం ఇప్పుడు తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. రాష్ర్టాన్ని ఒకప్పుడు “రైతు రాజ్యం”గా ప్రచారం చేశారు. రైతు సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల హామీలతో వ్యవసాయం బలపడిందని పాలకవర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ, క్ష‍ేత్రస్థాయిలో గ్రామీణ వాస్తవం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దుక్కిదున్నిన రైతు చివరకు అప్పు తీర్చలేక, పండించిన పంట అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి మనస్తాపంతో అదే దుక్కిలో ప్రాణాలు తీసుకుంటే – అది రైతు వైఫల్యం కాదు, ముమ్మాటికీ ప్రభుత్వాలదే.ఇటీవల మెదక్ జిల్లాలో గాయంతి రాజయ్య అనే రైతు ఇరవై రోజులుగా కొను గోలు కేంద్రం వద్ద ధాన్యం అమ్మేందుకు ఎదురుచూసి, డబ్బులు రాక అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

సకాలంలో కొనుగోళ్లు జరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ ప్రాంతంలో దిగుబడి సరిగా లేక అప్పుల భారంతో మరో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. వికారాబాద్‌లో కూడా వ్యవసాయ నష్టాలు, అప్పులు రైతు ఆ కుటుం బాన్ని విషాదంలోకి నెట్టాయి? వీటన్నింటికి కారణాలను విశ్లేషిస్తే కనిపించేదొక్కటే- పాలకవర్గాల ప్రణాళిక లోపం, నిర్లక్ష్యం. పంటవేసిన నుంచి అప్పుల కుంపటి రైతుల నెత్తిన పడుతోంది. ఓవైపు కుటుంబ సమస్యలు, మరోవైపు ప్రకృతీ వైఫరీత్యాలు ఇవన్నీ కూడా రైతును నైరాశ్యంలో ముంచుతున్నాయి. పేర్లు ఏవైనా ఆదుకుంటుందని చెప్పిన రైతు బంధు, రైతు భరోసా వారికి భరోసా నివ్వడం లేదు. పైగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువవుతు న్నాయి. ఇవన్నీ రైతులను ఆత్మహత్యలవైపు నెడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు, ఎరువులు, కూలి ఖర్చులు విపరీ తంగా పెరిగాయి. పంట చేతికొచ్చినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉండదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోతే రైతు మధ్యవర్తులపైనే ఆధారపడాల్సి వస్తోంది. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు అవకతవకలపై ఆందోళన చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు, కనీసం అమ్ముకోవడం కూడా గగనమైతే వారి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? పంట కోసి నెలరోజులు దాటుతుంటే ఇప్పటి వరకు సగమే కొనుగోలు జరగడం, అధికార యంత్రాంగం అలసత్వాన్ని చూపుతోంది. ఒక దగ్గర గన్నీ సంచుల కొరత, మరోచోట కాంటాల సమస్య, లోడింగ్‌ ‌బెడద. ఇవన్నీ సమకూర్చ వల్సింది సర్కారే కదా. రైతు నానా తిప్పలు పడి ఈ వేదన భరించలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్న దయనీయ స్థితి నెలకొంది. ఎందుకంటే, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టి ఉంటే అకాలంలో వర్షం వస్తే అసలుకు మోసం వస్తుంది. అందుకే గిట్టుబాటు ధర రాకున్నా నష్టానికి పంటలు అమ్ముకోవాల్సిన దుస్థితి ప్రభుత్వమే కల్పించింది. ఇంకొంతమంది రైతులు నేటికీ ధాన్యం కుప్పలపైనే పడిగాపులు కాయడం సర్కార్‌ ‌నిర్లక్ష్య ధోరణే తప్ప వేరే కాదు.

ఇన్ని సమస్యలు సవాల్‌ ‌విసురుతుంటే, రైతులపై ప్రకృతి కూడా కనికరం చూపడం లేదు. అకాల వర్షాలు, వడగళ్ల వాన, పంట నష్టం వారిని మరింత కుంగదీస్తున్నాయి. నల్లగొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో వర్షాల వల్ల ధాన్యం, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు తెలిపాయి. పంటపోతే రైతుకు వెంటనే పరిహారం అందడం లేదు. పంట బీమా సకాలంలో రాదు. బీమా కంపెనీలను బతికించడానికే తప్ప రైతు కుటుంబాలను కాదన్న సత్యం రైతులకు ఎప్పుడో అర్థమైంది. కానీ, దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో రైతు సొమ్ము కంపెనీల పరం అన్నట్టుగా ఉంది.
ప్రభుత్వం రైతు సంక్షేమంపై ప్రకటనలు చేస్తోంది. కానీ ఆచరణ కనుచూపు మేరలో లేదు. రైతు మరణించిన తర్వాత ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సమస్యకు పరిష్కారం కాదు. అతను బతికుండగానే అప్పు ఒత్తిడి నుంచి బయటపడే విధానం కల్పించాలి. ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకుండా చూడాలి. పంటకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర, తక్షణ నష్టపరిహారం, తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి. అలాగే రైతులు మనోధైర్యం కోల్పోకుండా గ్రామ స్థాయిలో మానసిక ఆరోగ్య సలహా కేంద్రాలు నెలకొల్పాలి. కానీ, ఇవన్నీ చేయాల్సిన పాలకులు రైతు ఆత్మహత్యను “వ్యక్తిగత కారణం”గా కొట్టిపారేయడం అన్యాయం. ఒక రైతు అప్పుల బాధతో చనిపోతే, అందులో పాలనా నిర్లక్ష్యానికి వాటా కచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ రైతును ఆదుకునే స్థితిలో ఉంటే, రైతు ఉరివేసు కోవాల్సిన పరిస్థితి రాదు. దీన్ని గుర్తెరగాలి.

ఇది కేవలం రైతుల సమస్య కాదు. దేశ ఆహారభద్రతకు సంబంధించిన విషయం కూడా. రైతు బతికితేనే సమాజం బతుకుతుంది. కానీ పాలకులు ఎన్నికల సమయంలో మాత్రమే రైతును గుర్తు చేసుకుని, తర్వాత మరచిపోతున్నారు. రైతు చనిపోతే సంతాపం తెలపడం చాలా సులువు. కానీ రైతు ఎందుకు చనిపోతున్నాడో పాలకులు అంగీకరించని అంశం.
తెలంగాణ అభివృద్ధి గణాంకాల్లో ఎంతో ఎదిగిందని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెబుతున్నారు. కానీ పొలం దున్నిన రైతు తన పంట అమ్ము కోలేక చనిపోతే, ఆ అభివృద్ధి గణాంకాలు అర్థం లేనివే అవుతాయి. రైతు చనిపోతే అది కుటుంబం కోల్పోయిన జీవితం మాత్రమే కాదు – సమాజం కోల్పోయిన ఆహార భద్రత కూడా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -