ప్రపంచ రాజకీయాల్లో మత తీవ్రవాదం?

అమెరికా రాజకీయులు, అధికారులు 2017లో అంతర్జాల కుతంత్రాల ఉద్యమం క్వానన్‌ (QAఅశీఅ)పై చర్చించేవారు. సైతాన్‌ను ఆరాధించే ఉన్నతవర్గాల రాజకీయ ముఠా పిల్లలను లైంగికంగా ఆకర్షించే అంతర్జాతీయ యంత్రాంగాన్ని నడుపుతోందని క్వానన్‌ అనుచరుల నమ్మకం. ఈ అశాస్త్రీయ అంశానికి బాధపడ్డా ఎవరూ దీన్ని నియంత్రించలేదు. డిజిటల్‌ యుగంలోనూ మానవత్వం జ్ఞానసమాజం నుండి చీకటియుగానికి తిరోగమిస్తోంది. తమ సుఖం కోసం దోపిడీ వర్గాలు పిల్లల రక్తం తాగుతారని ఉదార ప్రజాస్వామ్య దేశాల ప్రజల భావన. 17శాతం అమెరికన్లు క్వానన్‌ కథనాలను నమ్ముతారని సర్వేలు తెలిపాయి. 5శాతం జర్మన్లు రీచ్సర్గర్‌ (పౌర సామ్రాజ్యం) సభ్యులని జర్మన్‌ జాతీయ ఇంటెలిజెన్స్‌, రాజ్యాంగ పరిరక్షణ సంస్థల నివేదిక. ఇంగ్లండ్‌ ప్రభుత్వ, మాధ్యమాల, హాలివుడ్‌ శక్తివంతమైన అధికారులు పసిపిల్లల అక్రమరవాణా చేస్తున్నారని 33శాతం ఆంగ్లేయుల అభిప్రాయం.
రీచ్సర్గర్‌ సభ్యులు హింసాచార తీవ్రవాదులు. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్వభావాన్ని వ్యతిరేకిస్తారు. 1871లో స్థాపించబడిన జర్మన్‌ సామ్రాజ్యం, దాని సరిహద్దులు నేటికీ ఉన్నాయని నమ్ముతారు. జర్మనీ, అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ దేశాల ఆక్రమణలో ఉందంటారు. హింసతో రీచ్సర్గర్‌ను పునఃస్థాపించాలని వారి కోరిక. ప్రభుత్వ అధికారాలను, చట్టాలను ఆమోదించరు. పన్నులు చెల్లించరు. సెకండ్‌ జర్మన్‌ ఎంపైర్‌, ప్రష్యా ఫ్రీ స్టేట్‌, జర్మనియా ప్రిన్సిపాలిటి వంటి పేర్లతో సొంత సంస్థానాలను ప్రకటించుకున్నారు. సొంత పాస్‌ పోర్టులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, ప్రకటనల టి షర్టులు, జెండాలు ముద్రించుకున్నారు. శాక్సని-ఆనహాల్ట్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ నాజీవాదులను కుతంత్ర సిద్ధాంతకారులని వర్ణించారు. వీరు ఆయుధాలను సేకరించారు. మాజీ సైనికులైన సంస్థ సభ్యులు ఇతర సభ్యులకు సైనికశిక్షణ ఇస్తారు. 2022లో పార్లమెంటుపై దాడికి యత్నించారు. రీచ్సర్గర్లు రాజ్యాన్ని తిరస్కరిస్తారు. కాని అనేక కోరికలు, చట్టాలపై దావాలు, అభ్యంతరాలతో కోర్టులకు ఎక్కా రు. తమ కార్యక్రమాల వీడియోలు ప్రచారం చేస్తారు.
ప్రజాబృందాలు, రాజకీయులు తీవ్రవాదం వైపు పోతున్నారు. రాజకీయుల నుండే ప్రజలు ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. అమెరికాలో ప్రజాదరణతో ఎన్నికైన లారెన్‌ బోబర్ట్‌ లాంటి వారితో సహా పలువురు ఎం.పి.లు క్వానన్‌ సంస్థను సమర్థించారు. జర్మనీ మతవాద పార్టీ ఆల్టర్నేటివ్‌ ఫర్‌ డూస్చ్‌ లాండ్‌ (ఎ.ఎఫ్‌.డి.) బాగా పెరిగింది. తీవ్రవాదం, ప్రజాకర్షణల్లో పోటీలేని పార్టీగా ఎదిగింది. ఆస్ట్రియాలో జెనొఫోబిక్‌ ఫ్రీడం పార్టీ ఎన్నికల్లో ఆధిక్యత సాధించింది. ఇటలీలో ఫాటెల్లి డి ఇటాలియా, స్వీడన్‌లో స్వీడన్‌ డెమోక్రాట్స్‌ లాంటి మతవాద పార్టీలు అధికారానికి రావడం ప్రపంచంలో మతవాద బలానికి నిదర్శనం.
ఇంగ్లండ్‌లో ఏ మతవాద పార్టీ గెలవలేదు. కన్జర్వేటివ్‌ పార్టీ మతవాద ఓటర్ల అవసరాలను తీర్చింది. తీవ్రమతవాద, ఫాసిస్టు బ్రిటిష్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ), యూరప్‌ సమగ్రతావ్యతిరేక సనాతన భావజాల విధానాల యునైటెడ్‌ కింగ్డ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టి (ఉకిప్‌)లకు ఓటేసే అవకాశాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ కల్పించింది. అమెరికా రిపబ్లికన్ల ఆలోచనకు వ్యతిరేకంగా, సంప్రదాయవాద పరిమితులను దాటి బ్రిటిష్‌ టోరీలు తీవ్రవాదం వైపు మారారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ డేనియల్‌ కాక్జిన్సి 2020 రోమ్‌ జాతీయ సంప్రదాయవాద సమావేశాలకు హాజరయారు. అందుకు ఆయనతో క్షమాపణ చెప్పించారు. ఈ సమావేశాల్లో ఇటలి జార్జియా మెలోని, హంగేరి విక్టర్‌ ఓర్బాన్‌, అమెరికా సంప్రదాయ వార్తా సంస్థ, మతవాద రాజకీయ టివి ఛానల్‌ ఫాక్స్‌ పూర్వ సహాయకుడు టక్కర్‌ కార్ల్సన్‌, అమెరికా అధ్యక్ష అభ్యర్థి మతతత్వవాది రోన్‌ డిశాన్టిస్‌ వగైరా ప్రపంచ మతవాద పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఏడాది లండన్‌లో అదే సమావేశాలకు ప్రపంచ సంప్రదాయవాద పార్టీల ప్రతినిధులందరూ వచ్చారు. మతవాద పార్టీలు బ్రిటన్‌లో అధికారం పొందలేవు. కాని పార్లమెంటు ప్రాతినిధ్యానికి తీవ్రవాదులకు చాలా మార్గాలున్నాయి.
మౌలిక సంస్కరణలకు భాష కీలకం. సంప్రదాయవాద రాజకీయుల పద చాతుర్యమే దీనికి రుజువు. హౌం సెక్రెటరీ సుఎల్ల బ్రమర్మన్‌ ఇంగ్లండ్‌ వలసలను దక్షిణ కోస్తా ప్రాంతంపై దాడి అన్నారు. ”సాంస్కృతిక మార్క్సిజం పిల్లల మెదళ్ళను పాడుచేస్తున్నదన్న తీవ్రవాద కుతంత్ర సిద్ధాంతానికి ఎంపీ మిరియం గేట్స్‌ వంతపాడారు. ఈ కుతంత్ర పదప్రయోగంతో మత రాజకీయులు అమాయక ప్రజలతో కందిరీగల తుట్టెను లేపిస్తారు. మనిషి ఒక మూఢాంశాన్ని నమ్మితే, విచక్షణ కోల్పోయి అనేక అతిమూర్ఖ ప్రచారాలను నమ్మే స్థితికి దిగజారతాడని మానసికశాస్త్ర పరిశోధనలు నిర్థారించాయి. శాసన నిర్మాతలు కూడా ఆలోచన, విచక్షణ, ప్రజా శ్రేయస్సు పదాల అర్థాలనే మార్చారు. హాస్యాస్పద ఊహాగాథలను చరిత్ర నిజాలని నిస్సిగ్గుగా ప్రవక్తించే అధోగతికి దిగజారారు. అమెరికా పూర్వ అధ్యక్షుడు ట్రంప్‌, మన ప్రధాని, మంత్రివర్గ సంఫ్‌ు సభ్యులు ఇలాంటి భ్రమప్రాణులే. జర్మన్‌ పార్లమెంటు భవనం, గోధ్రా రైలు, అమెరికన్‌ కాపిటోల్‌ కాల్పులు, న్యూజీలాండ్‌ పార్లమెంటు, బ్రెజిల్‌ కాంగ్రెస్‌లపై దాడులు మతతీవ్రవాదం ప్రజాస్వామ్యాన్ని కాల్చడంతో సమానం. నేటి ప్రజాస్వామ్య పతనాన్ని, మతవాద తాత్వికతను, మతోన్మాద కుతంత్రాలను ఆపే స్థితిలో ప్రపంచం ఉందా?
మత తీవ్రవాదాన్ని తిప్పికొట్టడానికి మార్గాలు న్నాయి. మతవాదుల జీవితాలూ మారలేదు. పనిచేయకుండా ఆకలి, అవసరాలు తీరలేదు. మత రాజకీయులు ఆర్థిక, రాజకీయ లబ్ధిపొందారు. ధర్మరక్షణకు దేవుళ్ళు భారతంలోనే అవతరించారు. పాపుల రక్షణకు దేవదూత, స్త్రీవివక్షతల సమర్థకప్రవక్త వారి దేశాల్లోనే పుట్టారు. అధర్మం, పాపం, అసమానతలు దేవతల పితృదేశాల్లోనే ఉన్నాయా? దైవపాలకులు, దేవుళ్ళు పేదరికం, ఆకలి, అసమానతలను అంతం చేయలేదు. దోపిడీదారులు దొరలుగా, శ్రామికులు బానిసలుగా బతుకుతున్నారు. మత పాలకులు ప్రభుభక్తుల బ్రోచకులు. ప్రజాశ్రేయస్సును పట్టించుకోరు. సామాజిక పరిస్థితుల మెరుగుదల, అసమానతల తగ్గింపు సమస్యలను తగ్గిస్తాయి. విద్య వివేకాలను పెంచుతుంది. వైద్య సౌకర్యాలు పేదల ఆర్థిక భారాలను, సమయ వృధాను తగ్గిస్తాయి. శ్రమసామర్థ్యాన్ని, ఉత్పత్తి శక్తిని పెంచుతాయి. పెట్టుబడిదారి మత పాలకులు ఈ సమస్యలను పరిష్కరించరు. స్వీయ ప్రయోజనాల సౌలభ్యతకు జనాలను మత ఉన్మాదంలో, భ్రమల్లో, ఊహల్లో ముంచుతారు. సొంత సామాజిక మాధ్యమాలతో, కొన్న మాధ్యమాలతో, స్వతంత్య్ర మాధ్యమాలను బెదిరించి, వారి వాణిజ్య ప్రకటనలకు గండికొట్టి, ప్రజాపక్ష విలేఖరులను బంధించి అనుకూల ప్రచారాలు చేయించుకుంటారు. అవకాశవాద రాజకీయాలను ఆచరిస్తారు.
పౌర సమాజం బలపడాలి. మతోన్మాదుల ఎత్తుగడలను ప్రజలకు వివరించాలి. శాస్త్ర సాంకేతికతలతో, సామాజిక మాధ్యమాలలో, ప్రజా చైతన్య ప్రక్రియలతో, ప్రజల భాషలో సమస్యల అనుసంధానంతో, సామ్యవాద ప్రాయోజితాన్ని సోదాహరించాలి. శ్రామికులకు ప్రజానుకూల శ్రమసంస్కృతిని అలవర్చాలి. ప్రైవేటైజేషన్‌ శాపమే కాదు అవకాశాల వరం, సమస్యా పరిష్కార మార్గం. ప్రభుత్వీకరణ లక్ష్యాలను, ప్రయివేటీకరణ నష్టాలను ప్రయోగాత్మకంగా, ఆచరణాత్మకంగా వివరించాలి. ”ఉదార ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజా మాధ్యమాలు, ప్రభుత్వేతర (సేవా) సంస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. యజమానులను, పని స్థలాలను, కార్మిక చైతన్యాన్ని నమ్ముతున్నారు. ప్రజాస్వామ్య విలువల పోరాటంలో కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇంగ్లండ్‌ ‘ప్రజాస్వామ్య వాణిజ్య మండలి’ ఊహాగాథలను, కుతంత్రాల గుర్తింపు, ఎదుర్కునే పద్ధతులను పరీక్షలు, శిక్షణల ద్వారా ఉద్యోగులకు నేర్పుతోంది” అని ఎడెల్మన్‌ ట్రస్ట్‌ బారొమీటర్‌ సర్వేలలో ధృవీకరించింది. యువకులకు హక్కులనే కాక పౌర బాధ్యతలను నేటి సామాజిక మాధ్యమాల ద్వారా నేర్పాలి. శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత కల పౌరులుగా మారడానికి సహాయపడాలి. వారు తమకు అందిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్న, పరిశీలన, ఆలోచనలతో, వివేక తాత్వికతలను అభివృద్ధి చేసుకునే విధంగా తయారుచేయాలి. మత కోణంలో కాక మనిషిగా ఆలోచించడం నేర్పాలి. మానవత్వ లక్షణాలను తెలిపి మానవులుగా మారవలసిన ఆవశ్యకతను తెలపాలి. అభిజాత్య వారసత్వ సాంప్రదాయాల మంచిచెడులను తెలుసుకునే విధంగా మానసికశాస్త్ర అంశాలను బోధించాలి. ప్రజలు తరతమ భేదాలతో అందరూ మానసిక రోగులే. యువకులే నేటి దుష్ట పాలక విధానాలను గుర్తించి, మార్చి భవిష్యత్తును మార్చుకోగలరు. నేటి నిరాసక్త, నిస్తబ్ధ పౌరజీవనంలో, నిర్బంధ రాజకీయ పాలనలలో ఇదే విప్లవం.
సెల్‌:9490204545
సంగిరెడ్డి హనుమంతరెడ్డి

Spread the love