Saturday, June 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌‌లో మళ్లీ ఉద్రిక్తత

హార్ముజ్‌‌లో మళ్లీ ఉద్రిక్తత

- Advertisement -

ఓ కార్గో నౌకపై డ్రోన్‌ ‌దాడి యూఎన్‌ ‌తరలింపు కార్యక్రమం నిలిపివేత
‌టెహ్రాన్‌ : ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గురువారం ఓ కార్గో నౌకపై గుర్తుతెలియని ప్రాజెక్టైల్‌తో దాడి జరిగింది. అమెరికా అధికారులు ఈ దాడి ఇరాన్ డ్రోన్ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాడిలో నౌక బ్రిడ్జ్ దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం కానీ, చమురు లీకేజీ కానీ జరగలేదని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) వెల్లడించింది. అయితే సముద్ర మార్గంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఈ ఘటనతో యూఎన్‌కు చెందిన అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంఓ) చేపట్టిన ప్రత్యేక తరలింపు కార్యక్రమం నిలిచిపోయింది. ఇరాన్-అమెరికా ఘర్షణ ప్రారంభమైన తర్వాత పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది నౌకలు, 11 వేల మందికి పైగా నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. నావికుల భద్రత దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు ఐఎంఓ ప్రధాన కార్యదర్శి అర్సెనియో డొమింగెస్ ప్రకటించారు.

ఇరాన్ హెచ్చరికలు
కాగా దాడికి కొన్ని గంటల ముందే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్‌‌జీసీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ప్రకటించిన మార్గాల్లోనే ప్రయాణించే నౌకలకు భద్రత ఉంటుందని, ఇతర మార్గాల్లో వెళ్తే వాటి భద్రతకు తామేమీ బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. ఇటీవలే ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ కూడా ఇదే హెచ్చరిక చేస్తూ.. అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తే దాని పరిణామాలకు నౌక యజమానులు, నిర్వాహకులే బాధ్యత వహించాలని పేర్కొంది.

చమురు ధరలపై ప్రభావం
ఈ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 74 డాలర్లకు చేరుకున్నాయి. అనంతరం కొంత తగ్గినా, హార్ముజ్‌లో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలపై జూన్ 30 నుంచి నిపుణుల స్థాయి చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే హార్ముజ్‌లో తాజా దాడి, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు వంటి పరిణామాలు ఈ చర్చలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. మొత్తంగా.. శాంతి ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే హార్ముజ్ జలసంధిలో జరిగిన తాజా దాడి, ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, మధ్యప్రాచ్య భద్రతపై మళ్లీ అనిశ్చితి నెలకొనే సంకేతాలను ఇచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -