ప్రముఖ జర్నలిస్టు బిపిన్‌ చంద్రన్‌ హఠాన్మరణం

న్యూఢిల్లీ/తిరువనంతపురం : ప్రముఖ జర్నలిస్టు, సీపీఐ(ఎం) సోషల్‌ మీడియా విభాగం కార్యకర్త బిపిన్‌ చంద్రన్‌ (50) ఆదివారం హఠాన్మరణం చెందారు. బిపిన్‌ సీపీఐ(ఎం) మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లై కుమారుడు. మూడు రోజుల కిందట ఇంటర్నల్‌ ఆర్గాన్స్‌ దెబ్బతినడంతో బిపిన్‌ను తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి అదనపు వ్యక్తిగత కార్యదర్శి గాను, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ వ్యక్తిగత కార్యదర్శిగానూ బిపిన్‌ సేవలందించారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయ జీవితం గడిపిన బిపిన్‌..ఎంట్రప్రెన్యుర్‌ బిజినెస్‌ మ్యాగజిన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ పని చేశారు. బిజినెస్‌ స్టాండర్డ్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్తా సంస్థల్లో వివిధ హోదాల్లో పాత్రికేయ సేవలందించారు. అనంతరం సీపీఐ(ఎం) సోషల్‌ మీడియా విభాగంలో కేంద్ర కార్యాలయంలో పని చేశారు. బిపిన్‌కు భార్య షయీజా (జర్నలిస్టు, ఢిల్లీ), పిల్లలు ఆదిత్య పిళ్లై (ఫైనాన్షియల్‌ ఎనలిస్టు, బెంగళూరు), ఆరోహి పిళ్లై (విద్యార్థి, పూణే) ఉన్నారు.
సీపీఐ(ఎం) సంతాపం
50 ఏండ్ల ప్రాయంలోనే బిపిన్‌ హఠాన్మరణం చెందడం పట్ల సీపీఐ(ఎం) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. సీపీఐ(ఎం) సోషల్‌ మీడియా విభాగం ప్రారంభించిన తొలినాళ్లలో బిపిన్‌ కేంద్ర కార్యాలయంలో విశేష సేవలందించారని స్మరించుకుంది. నిత్యం కొత్త ఆలోచనలతో, సహచరుల అభిప్రాయాలను గౌరవిస్తూ బృందాన్ని నడిపించేవాడని కొనియాడింది. తనయుడిని కోల్పోయిన వేళ ఆయన తండ్రి, సీనియర్‌ నేత ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లైకి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సీపీఐ(ఎం) పేర్కొంది.

Spread the love