దక్షిణాదిపై బీజేపీ వివక్ష

BJP's discrimination against the south– పదేండ్లుగా మోడీ దేశాన్ని మోసం చేశారు
– కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీ : వయనాడ్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ లోకసభ ఎన్నికల ప్రచార సభలో బుధవారం పాల్గొని ప్రసంగించారు. బుల్లెట్‌ రైలు, సబర్మతి తరహాలో రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ తదితర ప్రాజెక్ట్‌లకు ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. అభివృద్ధి, ప్రాజెక్టులే కాకుండా రాజకీయ పదవుల విషయంలో కూడా ఆయన దక్షిణాది పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పదేండ్లుగా ప్రధాని మోడీ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్‌ పేపర్‌ ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని నిలదీశారు. ఎన్నికలకు ముందు తాను చెప్పినట్టే తెలంగాణలో కేసీఆర్‌ను గద్దెదింపామనీ, లోక్‌సభ ఎన్నికల్లో మరోసారీ అసెంబ్లీ ఫలితాలే పునరావృతమవుతాయని గుర్తు చేశారు. బీజేపీ ఎన్నికల బాండ్ల పేరుతో విచ్చలవిడి అక్రమాలకు పాల్పడుతూ అవినీతిని చట్టబద్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌ గాందీయేనని ధీమా వ్యక్తం చేశారు .

Spread the love