ప్రజాస్వామ్య ఫలాలు అందడం లేదు

Democracy is not bearing fruit– ఉద్యోగ కల్పన లేకపోవడమే దీనికి కారణం
– చిప్‌ పరిశ్రమకు భారీగా సబ్సిడీలెందుకు?
– ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలలో ఉపాధి ఏది?
– అవకాశాల కోసం విదేశాల బాట పడుతున్న యువత : ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
వాషింగ్టన్‌ : ప్రజాస్వామ్య ఫలాల ప్రయోజనాలను భారత్‌ అందిపుచ్చుకోలేకపోతోందని రిజర్వ్‌బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. మానవ పెట్టుబడిని పెంచాల్సిన అవసరం ఉన్నదని, వారి నైపుణ్యాలను కూడా మెరుగుపరచాలని ఆయన సూచించారు. ‘ప్రజాస్వామ్య ఫలాలను పొందే మార్గంలో మనం సగం దూరం ప్రయాణించాం. అయితే ఆ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవ డమే సమస్యగా మారింది’ అని చెప్పారు. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన సదస్సులో రఘురామ్‌ రాజన్‌ ప్రసంగించారు.
ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి
ఈ కారణం చేతనే తాను ఆరు శాతం వృద్ధిని గురించి మాట్లాడానని రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రజాస్వామ్య ఫలాలు అందకపోవ డానికి యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడమే కారణమని ఆయన చెప్పారు. ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటే ప్రజల సామర్థ్యాలను మెరుగుపరచాలని, ఉద్యోగాల స్వభావాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతకు అప్రెంటిస్‌షిప్‌ కల్పిస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ విలువైనదేనని చెప్పారు. అయితే దీనిని సమర్ధవంతంగా అమలు చేయాలంటే చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. మంచి ఉద్యోగాలు చేయడానికి మనకు మరింత మంది విద్యార్థులు అవసరమవుతారని తెలిపారు. ఉద్యోగాల కల్పనపై మరింతగా దృష్టి సారించాలని కోరారు.
ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలపై చిన్నచూపు
చిప్‌ తయారీపై భారత్‌ పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని రఘరామ్‌ రాజన్‌ తప్పు పట్టారు. ‘ఈ చిప్‌ ఫ్యాక్టరీలను గురించి ఆలోచించండి. చిప్‌ తయారీ కోసం అనేక బిలియన్‌ డాలర్ల సొమ్మును సబ్సిడీగా అందజేస్తున్నారు’ అని చెప్పారు. తోలు పరిశ్రమ వంటి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న రంగాల పనితీరు సంతృప్తికరంగా లేదని అన్నారు. ‘ఆయా రంగాలలో మనం సరిగా పనిచేయడం లేదు. ఉద్యోగాల సమస్య పెరిగితే ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఉద్యోగ సమస్య అనేది గత పది సంవత్సరాలలో వచ్చింది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా అది పెరుగుతూ వస్తోంది. అయితే ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్న రంగాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకొని దానిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడ్డారు. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాల స్థాపన కోసం సింగపూర్‌, సిలికాన్‌ వ్యాలీ వెళుతున్నారని, ఎందుకంటే అక్కడి మార్కెట్లలో ప్రవేశం వారికి సులభతరంగా ఉంటోందని చెప్పారు.
యంగ్‌ ఇండియాది కోహ్లీ మనస్తత్వం
‘దేశంలోనే ఉండకుండా బయటకు ఎందుకు వెళ్ల్లాల్సి వచ్చిందో వారిని అడగాలి. అయితే వారు ప్రపంచాన్నే మార్చేయాలని కోరుకోవడం ఆనందదా యకం. మరిన్ని దేశాలలో విస్తరించాలని వారు భావిస్తున్నారు. ఒక యంగ్‌ ఇండియా ఉన్నదని నేను అనుకుంటున్నాను. దానిది విరాట్‌ కోహ్లీ మనస్తత్వం. ప్రపంచంలో రెండో స్థానంలో ఉండడాన్ని వారు ఇష్టపడరు’ అని రఘురామ్‌ రాజన్‌ అన్నారు.

Spread the love