ఘనంగా సీతారాముల కల్యాణం

ఘనంగా సీతారాముల కల్యాణం– ప్రభుత్వం తరఫున సీఎస్‌ లాంఛనాలు
– నేడు పట్టాభిషేక మహోత్సవం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ లగ మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టడంతో కల్యాణ క్రతువు పూర్తయింది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కల్యాణ మహౌత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కల్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. అభిజిత్‌ లగంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ గావించారు. తరువాత భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను సీతారాముల శిరస్సుపై పోశారు. తదనంతర కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. పట్టాభిషేక మహోత్సవాన్ని గురువారం నిర్వహిస్తారు.
ప్రభుత్వం తరఫున సీఎస్‌ పట్టువస్త్రాల సమర్పణ
లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దంపతులు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ దంపతులు హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ పీఎస్‌ నర్సింహ, హైకోర్ట్‌ జడ్జి భీమపాక నగేష్రా కల్యాణంలో పాల్గొన్నారు. రామయ్య కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మిథులా స్టేడియం.. సర్వాంగ సుందరం..
శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా మిథులా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్‌ దీపాలతో మిరమిట్లు గొలుపుతోంది. అలాగే మిథిలా కల్యాణ మండపంలో 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 31 వేల మందికి పైగా భక్తులు ఈ కల్యాణం వీక్షించారు. 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. శ్రీ రామ పట్టాభిషేకం గురువారం ఉదయం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్‌ రాజ్‌, ఈవో రమాదేవి క్రతువుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Spread the love