షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం– చిన్న వ్యాపారుల షాపుల దగ్ధం
– సుమారు రూ.3లక్షల వరకు నష్టం
నవతెలంగాణ-కల్లూరు
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి పండ్ల షాపు, టైర్ల కొట్టు, కొలిమి షాపు పూర్తిగా దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో మంగళవారం తెల్లవారు జామున జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి తాళం వేసిన షాపుల్లో.. మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో స్థానికులు మేల్కొని మంటలార్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అగ్నిప్రమాదం జరిగిన పండ్ల షాప్‌లో సుమారు రూ. లక్ష విలువ చేసే వివిధ రకాల పండ్లు దగ్ధం కాగా, రూ.40 వేల నగదు కూడా దగ్ధమైనట్టు యజమాని షేక్‌ నషీర పాషా తెలిపారు. టైర్ల కొట్టులో గాలి మిషన్‌, టైర్లు దగ్ధం కావడంతో సుమారు లక్ష రూపాయల వరకు నష్టం జరిగిందని యజమాని ఆకుల ప్రసాద్‌ వాపోయాడు. కొలిమి షాపులో రూ.50 వేల వరకు నష్టం జరిగిందని యజమాని తెలిపారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌ హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయితో ఫోన్‌లో మాట్లాడి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనా స్థలంలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆర్‌ఐలు అన్వర్‌ పాషా, స్టాలిన్‌కు ఎమ్మెల్యే ఆదేశించినట్టు తెలిపారు.

Spread the love