ఎమర్జెన్సీని మించి నిరంకుశ విధానం

ఎమర్జెన్సీని మించి నిరంకుశ విధానం– రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నం
– ప్రబీర్‌ పుర్కాయస్థ ‘అలుపెరుగని పోరాటం’ నాటి ఎమర్జెన్సీ నుంచి నేటి దాకా
– పుస్తక ఆవిష్కరణలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నాటి ఎమర్జెన్సీని మించిన నిరంకుశ విధానాన్ని బీజేపీ అవలంబిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగకుండా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రబీర్‌ పుర్కాయస్థ ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకంలో వివరించారన్నారు. నాటి ఎమర్జెన్సీ నుంచి నేటి దాకా అవే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి మీటింగ్‌ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ సభలో రాఘవులు మాట్లాడారు. ఎమర్జెన్సీలో జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళీ పోరాటం.. ఆపై అరెస్టు.. మళ్లీ నిర్బంధం ఆనవాయితీగా పుర్కాయస్థ కొనసాగించారన్నారు. ప్రస్తుతం ఉపా చట్టం కింద ఆయన జైలు జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఎంత కష్టం అయినా ఓ విప్లవకారుడు ఎంత సులభంగా ఎదుర్కొంటాడో ఈ పుస్తకం ద్వారా పరిచయం చేశారని వివరించారు. ఇది అలుపెరుగని పోరాటం కాదు.. ఆగిపోని పోరాటంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌, బీజేపీల అధికార మార్పిడి జరిగింది తప్పా జైళ్లు, నిర్బంధాలు మారలేదన్నారు. కారణం లేకుండా జైళ్లో పెట్టొచ్చని నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు చాటగా.. నేటి బీజేపీ పాలనలో అంతకుమించిన అత్యవసర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఎమర్జెన్సీలో దుకాణం ముందు ధరల పట్టిక పెట్టలేదని అరెస్ట్‌ చేశారు… కానీ నేడు ఏ కారణం లేకుండా నిర్బంధించే విధానాన్ని బిజెపి అవలంబిస్తుందని తెలిపారు. భయపడే వారికి నిరాశ ఉంటుంది… కానీ ఎదురు తిరిగేవాడికి ఆత్మవిశ్వాసం ఉండాలని పుర్కాయస్థ
ఈ పుస్తకంలో సూచించారన్నారు. బిజెపి పాలనలో స్వావలంబన కూడా లేకుండా పోతున్నదన్నారు. రాజకీయాల్లో కలిసి ఉంటారేమో కానీ కులం విషయంలో కాంప్రమైజ్‌ అయ్యే పరిస్థితులు లేవన్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తే 254 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు. అంతా స్వదేశీ అని చెప్పే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయం కూడా వేదాల్లో ఉండవచ్చేమో..! అని వ్యాఖ్యానించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని చిప్స్‌ కంపెనీకి రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించలేక పోయిందన్నారు. నవతెలంగాణ బుక్‌ హౌస్‌ ఎడిటర్‌ ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నానాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ విద్యావేత్త రవిమారుత్‌, డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపీనాథ్‌, జేఎన్‌యూ పూర్వ విద్యార్థి నెల్లూరు నరసింహారావు, విజరు, ఐద్వా నాయకురాలు మాచర్ల భారతి, పుస్తక అనువాదకులు బోడపట్ల రవీందర్‌, నవతెలంగాణ ఖమ్మం రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌డీ.జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love