నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ నల్గొండ వననేస్తం అవార్డు గ్రహిత పురుషోత్తం రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కి ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రచారం కోసం రోడ్ల పక్కన పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని, అవి రోజుల తరబడి అలాగే ఉండిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోందని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాల్లో అనేక ఫ్లెక్సీ హోర్డింగులు వెలిశాయని, వాటిని తొలగించడంలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని, అధికారుల ఉదాసీనత వల్లే జిల్లాలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని విమర్శించారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రహదారులపై ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తక్షణమే తొలగించి, పచ్చదనాన్ని పెంచడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలా మార్గం సుగమం చేయాలని పురుషోత్తం రెడ్డి కోరారు.



