కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలకు అల్టిమేటం
ప్రయివేటుపరం చేస్తే సహించం
ప్రభుత్వ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తే అడ్డుకుంటాం
కాక్రోచ్‌ల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు
టాస్క్, సీసీఐ సాధన కమిటీ రౌండ్‌టేబుల్‌లో అఖిలపక్ష పార్టీల నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని పునరుద్ధరించా ల్సిందేనని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌తోపాటు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. లేదంటే తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు బీజేపీ ఎంపీలు వారి పదవులకు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను, సీసీఐని ప్రయివేటుపరం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ సంపదను, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనుకుంటే అడ్డుకుంటామన్నారు. ‘సీసీఐ పునరుద్ధరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’అనే అంశంపై సీసీఐ సాధన కమిటీ, తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.500 కోట్లు కేటాయిస్తే, మిగిలిన రూ.1,500 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చని అన్నారు. ఆ పరిశ్రమ వస్తే ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. మౌలిక వసతులు మెరుగవుతాయనీ, ఇతర పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని వివరించారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందుకే సీసీఐని పునరుద్ధరించడం లేదన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదనీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదనీ, అభివృద్ధికి సహకరించడం లేదని చెప్పారు. ప్రశ్నిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగించి నిర్బంధాలకు గురిచేస్తున్నదని అన్నారు. వినతిపత్రాలు ఇస్తే సరిపోదనీ, సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంపై పోరాడాలనీ, నిధులివ్వాలని ప్రశ్నించాలని కోరారు. సీసీఐని పునరుద్ధరించకుంటే బీజేపీ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది ఎంపీలు తెలంగాణ నుంచి ఎందుకని ప్రశ్నించారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ జరగాలనీ, అందుకోసం మంత్రి శ్రీధర్‌బాబును కలుద్దామని అన్నారు.
దాన్ని పునరుద్ధరించే రాజకీయ అవసరాన్ని కల్పించేలా అందరం కృషి చేయాలన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాట్లాడుతూ సీసీఐని ఎందుకు పునరుద్ధరించాలో సమగ్రంగా వివరించాలని చెప్పారు. సిమెంటు తలసరి వినియోగం ప్రపంచంలో 500 కిలోలుంటే, భారత్‌లో 280 కిలోలు ఉందని వివరించారు. ఇండ్లు, మౌలిక వసతుల కల్పన కోసం భవిష్యత్‌లో సిమెంటు వాడకం పెరుగుతుందన్నారు. దేశ జీడీపీ 6.7 శాతం ఉంటే, సిమెంటు వృద్ధి రేటు 8.9 శాతం ఉందని చెప్పారు. సిమెంటుకు వాడే లైమ్‌స్టోన్, బొగ్గు, నీరు వంటివి అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీసీఐకి సొంత భూమి ఉందన్నారు. ఉద్యమాలను ఉధృతం చేసి సీసీఐని పునరుద్ధరించుకోవాలని చెప్పారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఎన్నికల ముందు సీసీఐని పునరుద్ధరిస్తామని ఎందుకు వాగ్ధానం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లు పొంది గెలిచాక మోసం చేయాలనే చేశారా?అని ప్రశ్నించారు. ఆర్నెల్లలోగా సీసీఐని పునరుద్ధరించకుంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి జోగురామన్న మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ కోసం పోరాటాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయాలకు తావులేకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కానీ కేంద్రం సీసీఐని ప్రయివేటుపరం చేయాలని చేయాలని చూస్తున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు నంది రామయ్య, న్యూడెమోక్రసీ నాయకులు చలపతిరావు, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కార్యదర్శి జోజిరెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, సీసీఐ సాధన కమిటీ నాయకులు మల్లేష్ మాట్లాడుతూ సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో సమస్య పరిష్కారమయ్యేంత వరకు తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. టాస్క్ నాయకులు ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర నాయకులు దత్తాత్రి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజినీకాంత్, టి నాగరాజు, హైదరాబాద్ కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఓయూ మాజీ వీసీ డి రవీందర్ యాదవ్, పీడీఎస్‌యూ నాయకుడు నవీన్, టాస్క్ ప్రతినిధులు ఎస్‌వీసీ ప్రకాశ్, గుడిసె రూబీ స్టీవెన్ సన్, పెద్దూరి వెంకన్న, మాధవ్, భాను దాస్ తదితరులు పాల్గొన్నారు.
సీసీఐని పునరుద్ధరించకుంటే రాజీనామా చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



