Saturday, August 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతులను నిలబెట్టగలిగే శక్తి రాష్ట్రానికే ఉంది

రైతులను నిలబెట్టగలిగే శక్తి రాష్ట్రానికే ఉంది

- Advertisement -

 అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
‘ఎల్‌నినో ప్రభావం- వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ’పై వర్క్ షాప్
 పాల్గొన్న మంత్రులు సీతక్క, 
వాకిటి శ్రీహరి

నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఎల్‌నినో కాదు.. ఎల్‌నినో తాత వచ్చినా తెలంగాణ రైతులను నిలబెట్టగలిగే శక్తి రాష్ట్రానికే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లో నిర్వహించిన ‘ఎల్‌నినో ప్రభావం- వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ’పై నిర్వహించిన వర్క్‌షా‌ప్‌‌లో మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఎల్‌నినో సవాళ్లను విపత్తుగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలు అత్యంత కీలకమని, పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను అంచనా వేసి, ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. రైతులకు మంచి చేయాలన్న చిత్తశుద్ధితో అధికారులు పనిచేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. తెలంగాణను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడేందుకు ముందుగానే ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అందుబాటులో ఉండే భూగర్భ జలాలపై రోజువారీగా అంచనాలు రూపొందించి, వాటిని జాగ్రత్తగా వినియోగించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆటో స్టార్టర్లతో రేయింబవళ్లు మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృథా చేయకుండా, పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎల్‌‌నినోను సవాల్‌గా కాకుండా.. అవకాశంగా మలుచుకోవాలి : మంత్రి సీతక్క
ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొత్త సాంకేతికత కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, గతంలో మన తాతలు, తండ్రులు అనుసరించిన నీటి సంరక్షణా పద్ధతులను తిరిగి ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. 1951 నుంచి నేటి వరకు 12సార్లు ఎల్‌నినోను భారత దేశం ఎదుర్కొందన్నారు. కరువును ఎలా ఎదుర్కోవాలనే అవగాహన రైతులకు ఉంటుంది కానీ ఆ అవగాహనను ఆచరించేలా చేసే బాధ్యత మనదే‌నని అన్నారు. పంటల మార్పిడి ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చనే విషయంలో రైతులకు సలహాలు ఇవ్వాలని తెలిపారు. కరవు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణ వంటి వాటిపై అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్‌నినో విషయంలో దేశంలోనే తెలంగాణ మాత్రమే ఇలాంటి ముందస్తు కార్యక్రమం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -