మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మంత్రి అడ్లూరితో కలిసి
గృహసముదాయాన్ని సందర్శన
నవతెలంగాణ – జగిత్యాల
నూకపల్లి 2 బీహెచ్‌కే కాలనీలో నివసిస్తున్న లబ్దిదారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా నూకపల్లిలోని 2 బీహెచ్‌కే గృహ సముదాయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి పొంగులేటి సందర్శించారు. మిషన్ భగీరథ ట్యాంక్‌పైకి వెళ్లి అక్కడి నుంచి గృహ సముదాయాన్ని పరిశీలించిన మంత్రి అనంతరం లబ్దిదారులతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో నేరుగా మాట్లాడి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, సెల్‌టవర్, తాగునీరు, పాఠశాల, ఆస్పత్రి వంటి సౌకర్యాలు కల్పించాలని లబ్దిదారులు మంత్రిని కోరారు. లబ్దిదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. అవసరమైన మౌలిక సదుపాయాలను మూడు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలనీలో ఇప్పటికే పలు మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. 160 ఇండ్ల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, వాటర్ డ్రెయిన్లు, సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.52.57 లక్షలు మంజూరు కాగా రూ.51.09 లక్షలు వ్యయం చేసినట్టు తెలిపారు. 360 ఇండ్ల ప్రాంతంలో ఇదే తరహా పనులకు రూ.99.25 లక్షలు మంజూరు చేసి రూ.88.48 లక్షలు వ్యయం చేసినట్టు వివరించారు. అనంతరం కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడంతో పాటు కేంద్రంలో పిల్లల సంఖ్య, వారికి అందుతున్న వసతులు, ఇంకా అవసరమైన సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించేలా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నూకపల్లి 2 బీహెచ్‌కే కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



