– ఇసుక అక్రమదారుల బైండోవర్..
నవతెలంగాణ-బెజ్జంకి : ఏప్రిల్ 28,2026న టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేయడంతో మండల పరిధిలోని దాచారం గ్రామ శివారులో నిల్వ చేసిన అక్రమ ఇసుక వ్యవహరం బట్టబయలైంది. అక్రమంగా ఇసుక నిల్వ చేసిన రవాణదారులపై అధికారులు చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తుండడంతో మే 24,2026న “తిలా పాపం తలా పిడికెడు”శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. నవతెలంగాణ కథనానికి స్పందించిన తహసీల్దార్ శ్రీకాంత్ సంబంధిత అధికారుల నివేదిక ప్రకారం అక్రమ ఇసుక రవాణదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన సుమారు 6 మంది అక్రమ ఇసుక రవాణదారులను తహసీల్దార్ శ్రీకాంత్ బైండోవర్ చేపట్టారు. అక్రమంగా ఇసుక రవాణ చేస్తే ఉపేక్షించమని తహసీల్దార్ హెచ్చరించారు.
బైండోవర్ సరే..ఇసుక నిల్వలపై..?
ఎట్టకేలకు అధికారులు అక్రమ ఇసుక రవాణదారులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు బాగున్నా..అధికారులు స్వాధీనపర్చుకున్న అక్రమ నిల్వలపై చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో అచేతన స్థితిని ఎదుర్కొంటున్నారని.. ఇప్పటికైనా ఇసుక నిల్వపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని అధికారులను పలువురు దాచారం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.



