Thursday, May 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి

- Advertisement -

వ్య‌వ‌స్థ‌లో అంద‌రూ భాగ‌స్వాములే.. 
ప‌రిధి దాటితే ఒప్పుకునేది లేదు :
పోలీస్ అధికారుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్

పోలీస్ శాఖ‌లో రెస్పాన్సిబిలిటీ పెరగాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ్య‌వ‌స్థ‌లో అంద‌రూ భాగ‌స్వాములేన‌ని, అందువ‌ల్ల ప‌రిధి దాటేందుకు ప్ర‌య‌త్నిస్తే పోలీస్ అధికారుల‌నైనా ఒప్పుకోబోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. హైద‌రాబాద్ లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సీఆర్ హెచ్ఆర్‌డీ)లో బుధ‌వారం పోలీస్ ఉన్న‌తాధికారుల‌తో సీఎం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌ను పోలీస్ అధికారుల‌తో పంచుకునేందుకే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. ఎవరైనా హెడ్ క్వాటర్స్ వదలాలంటే తప్పని సరి గా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. క్రైమ్ రివ్యూ మీటింగుల‌ను నిర్ణీత వ్య‌వ‌ధిలో త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని సూచించారు. జిల్లా ఎస్పీ లు నిరంతరం జిల్లాల్లో ప‌ర్య‌టించాల‌ని, ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాల‌ని ఆదేశించారు. రౌడీ షీటర్ల పైన నిరంతరం పర్యవేక్షణ ఉండాల‌ని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త పంథాలో నేరాలు (క్రైమ్ అప్‌డేట్‌) అవుతోంద‌ని గుర్తు చేశారు.

దానికి అనుగుణంగా పోలీసింగ్ కూడా అప్‌డేట్ కావాల‌న్నారు. గంజాయి రవాణాను అరికట్టాలని, దానిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ లోని అన్ని వాహనాలు ఈవీకి మారాల‌ని అన్నారు. శాంతి భద్రతల విషయం లో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోన‌ని హెచ్చ‌రించారు. కాలం చెల్లిన ఆయుధాలను తొలగించాల‌ని ఆదేశించారు. పెట్రోలింగ్ ను, విలేజ్ పోలీసింగ్‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌న్నారు. రౌడీ షీట్,హిస్టరీ షీట్ ల పైన రివ్యూలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎఫ్ ఎస్ ఎల్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల‌ని దిశా నిర్దేశం చేశారు. వచ్చే ప‌దేండ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాల‌న్నారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ డిపార్టుమెంట్ సిద్ధం కావాలని, ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాల‌ని అధికారుల‌కు సూచించారు.

డ్రోన్ పోలీసింగ్ పెంచాలి..పోలీసింగ్ లో సాంకేతికతను వినియోగిం చుకోవాలి..సీసీ కెమెరాల సంఖ్య‌ను పెంచుకోవాలి..కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సమర్థ వంతంగా వినియోగించుకోవాల‌ని సీఎం సూచించారు. పోలీస్ డిపార్టుమెంట్‌ లో అవినీతికి ఆస్కారం ఉండ‌కూడ‌ద‌ని, మెరిట్ ప్రకారం పోస్టింగులు ఇవ్వాల‌ని ఆదేశించారు. పోలీస్ అధికారుల మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. డిపార్టుమెంటు బ‌లోపేతం కోసం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తామ‌ని, ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామ‌ని వెల్ల‌డించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో పిర్యాదుల కోసం క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి..రోడ్ సేఫ్టీ,ట్రాఫిక్ ను ఒక యూనిట్ చేయాలి.. ఆహార కల్తీ పైన ఉక్కుపాదం మోపాలి..దాని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల‌ని ఆదేశించారు. ఆహార కల్తీ వ‌ల్ల క్యాన‌ర్ కేసులు పెర‌గ‌టం ప‌ట్ల సీఎం ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు,రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి,డీజీపీ సీవీ ఆనంద్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ,అదనపు డీజీ లు,పోలీస్ కమిషనర్ లు,ఐజీ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -