వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు: రిటైర్డ్ డీఎఫ్ఓ

– పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు పురుషోత్తం
నవతెలంగాణ – శాయంపేట
అడవిలో స్వేచ్ఛగా తిరిగే వన్యప్రాణులను వేటాడి చంపితే వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రిటైర్డ్ జిల్లా అటవీశాఖ అధికారి, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు పురుషోత్తం అన్నారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో, పత్తిపాక గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972, రాజ్యాంగ అధికరణ 51 ఎజి నిర్దేశం ద్వారా ప్రతి పౌరుని ప్రాథమిక విధి అయిన ప్రకృతి వనరులైన వనాలు, వన్యప్రాణులు, నీటి నిలువల సంరక్షణను గూర్చి తెలియజేశారు. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడడానికి ఉచ్చులు బిగించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సభ్యుడు సునీల్ మండల పరిధిలోని గ్రామాలలో వన్య ప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లను అడ్డుకొని జైలుకు పంపించినట్లు గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు గ్రీన్ క్లబ్ ఏర్పాటు చేసుకొని తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. పొడి చెత్తలో ప్లాస్టిక్ వ్యర్ధాలు వస్తాయని, తడి చెత్తలో కూరగాయల వ్యర్ధాలు, చెట్ల ఆకులు సేకరించి వాటితో సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని మొక్కలకు అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షుడు రవి బాబు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, సభ్యులు మారపల్లి సునీల్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love