నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు సమ్మె సందర్భంగా ప్రభుత్వమిచ్చిన హామీని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు 24 రోజులుగా సమ్మె చేశారని అప్పటి ప్రభుత్వం, అధికారులు చర్చలు జరిపి ఐదు లక్షల టీచర్స్ కి రెండు లక్షలు అంగన్వాడీ ఆయా కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్స్ పెట్టగా రెండు లక్షల అంగన్వాడీ టీచర్లకు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 65 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రానికి సేవ చేసిన ఉద్యోగులకు కనీస గౌరవ మర్యాదలలో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ గత ప్రభుత్వం దొంగచాటుగా ఇచ్చిన జీవో నెంబర్ 10 ప్రకారం టీచర్లకు లక్ష , ఆయాలకు 50 వేలు ఇస్తామని టిఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తామని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదని ఇది సరైనది కాదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిలువేరు రామకుమారి అంగన్వాడీ యూనియన్ నాయకులు ఉపేంద్ర,మురలమ్మ,పుష్పమ్మ, నిర్మలప్రకాష్,సరస్వతి, పూల బాయ్ ,అంజమ్మ,రోషమ్మ లు పాల్గొన్నారు.