మేనేజ్‌మెంట్‌ కోటాలో రేవంత్‌ సీఎం అయ్యాడు !

In the management quota Revanth became CM!– 24ఏండ్లు పనిచేసిన కారుకు సర్వీసింగ్‌ అవసరం పడదా
– బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల నియోజకవర్గ మీటింగ్‌లో కేటీఆర్‌ వ్యాఖ్యలు
– అవినీతి జరిగితే ఎంక్వైయిరీ చేసి చర్యలు తీసుకోవాలని సవాల్‌
– ఒకరిద్దరు పోయినా పర్వాలేదు.. కొత్తవారిని తయారుచేసుకుందాం
– ఐదేండ్లు ప్రజలపక్షాన ఉండి పోరాడుతాం
నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ అప్పటి ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి మేనేజ్‌మెంట్‌ కోటాలో రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని, మూడు ఫీట్లు లేని రేవంత్‌ రెడ్డి అతిపెద్ద బీఆర్‌ఎస్‌ పార్టీని 100మీటర్ల లోతులో ఎలా పాతి పెడతాడని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మంచి మంచి తీస్మార్‌ ఖాన్‌లే కేసీఆర్‌ను ఏం చేయలేకపోయారని, రేవంత్‌రెడ్డి లాంటి బుడ్డరఖాన్‌తో ఏమవుతుందని అన్నారు. 24ఏండ్లు పనిచేసిన కారుకు చిన్న సర్వీసింగ్‌ అవసరం పడదా అన్నారు. ఇది చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారం పార్టీ కంటే కేవలం 1.8శాతం ఓట్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీకి తక్కువ వచ్చాయని, 14నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీతో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. 420హామీలు ఇచ్చి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతుబంధు కోసం ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తమకు ముఖ్యం కాబట్టి ప్రజల పక్షాన ముందుంటామని, ప్రశ్నించడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరిగితే ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైయిరీ చేసి చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. రైతు భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి బోగస్‌ మాటలు మాట్లాడుతున్నారని, వచ్చే పంట వరకు రైతు భరోసా ఇవ్వకుంటే తెలంగాణ ప్రజలు చీల్చి చెండాడుతారన్నారు.
39మంది ఎమ్మెల్యేలం కలిసి ప్రభుత్వాన్ని దిగ్భంధనం చేసి సిరిసిల్ల నేతన్నల కోసం పోరాడుతామని హామీ ఇచ్చారు. పోయింది అధికారం మాత్రమే పోరాట ప్రటిమ కాదన్నారు. ఒకరిద్దరు పోయినా పర్వాలేదు.. కొత్తవారిని తయారు చేసుకుందామని, ఐదేండ్లు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెజార్టీ ఎందుకు తగ్గిందో చర్చించి లోపాలను మార్చుకుందామని, కార్యకర్తల కోసం కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడతానన్నారు. ఎంపీలుగా వినోద్‌ కుమార్‌, బండి సంజరుల పనితీరును పోల్చుకోని చూడాలని, బండి సంజరు జిల్లాలో ఇప్పటివరకు తిరగని మండలాలు కూడా ఉన్నాయన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా కేంద్రం నుంచి సిరిసిల్లకు తీసుకురాలేదని మండిపడ్డారు. అమిత్‌ షా చెప్పులు మోసుడు తప్ప బండి సంజరు చేసిందేమీ లేదని, సిరిసిల్ల ప్రజలను ఓటు అడిగే హక్కు బండికి లేదన్నారు. భారత్‌ జోడో అని రాహుల్‌ గాంధీ అంటుంటే కాంగ్రెస్‌ చోడో అని ప్రజలు అంటున్నారని, మోడీని ఆపే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.
కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న సంబంధం వల్లే రెండు ఎమ్మెల్సీలు వాళ్లకు పోయాయని, దాసోజు శ్రావణ్‌ను అంగీకరించని గవర్నర్‌ కోదండరాంను ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. బీజేపీి, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న అనైతిక ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, ఎన్‌ఏఎఫ్‌ఎస్‌సీఓబీ చైర్మెన్‌ కొండూరి రవీందర్‌రావు, సెస్‌ చైర్మెన్‌ చిక్కాల రామారావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్‌, మంచే శ్రీనివాస్‌, బొల్లి రామ్మోహన్‌, దరువు ఎల్లన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love