బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న రేవంత్ : కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్న శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఉంటే తన జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలనే నినాదంతో మోడీ ముందుకు వెళుతున్నారని అన్నారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి ముఖ్యనేతలతో మేడిప‌ల్లిలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, మీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 420 హామీలు అమ‌లు చేయాల‌న్నారు. లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని హెచ్చరించారు. ప్రజలందరినీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్‌ను రాజ‌కీయంగానే బొంద పెడతామని హెచ్చరించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీలోకి జంప్ అవుతారని పునరుద్ఘాటించారు. పదేళ్లలో మోడీ ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను కూల్చారని ఆరోపించారు. మోడీ ఎవ‌ర్నీ బతకనీయడం లేదని అన్నారు.

 

 

Spread the love