గంజికీ కష్టమే… పెరుగుతున్న బియ్యం ధరలు

– ధరల సూచికలో 11 ఏండ్ల గరిష్ట స్థాయికి…
–  దిగుబడులపై ఎల్‌నినో ప్రభావం
ముంబయి : గడచిన 11 సంవత్సరాలతో పోలిస్తే అంతర్జాతీయంగా బియ్యం ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో కొన్ని దేశాలలో ధాన్యం దిగుబడి తగ్గడంతో ధరలపై ప్రభావం పడుతోంది. బియ్యం ఎగుమతులు మన దేశం నుండే 40% వరకూ జరుగుతున్నాయి. గత సంవత్సరం మన దేశం నుంచి 56 మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. భారతదేశం బియ్యాన్ని అతి తక్కువ ధరకు సరఫరా చేస్తోందని బియ్యం ఎగుమతిదారుల సంఘం (ఆర్‌ఈఏ) అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు.
ఆసియాలో 300 కోట్ల మంది ప్రజలు వరి అన్నమే తింటారు. సుమారు 90% పంటను నీటి పారుదల సౌకర్యం పైనే ఆధారపడి వేస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఆసియాలో వర్షపాతం తగ్గింది.
అననుకూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గడానికి ముందే అంతర్జాతీయ బియ్యం ధరల సూచిక 11 సంవత్సరాల గరిష్ట స్థాయిని చేరింది. థాయిలాండ్‌, వియత్నాంలలో మాత్రం ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలు అందించడంతో ఉత్పత్తి కొంత పెరిగింది. పరిమిత సరఫరాల కారణంగా బియ్యం ధరలు ఇప్పటికే పెరిగాయని, ఉత్పత్తి తగ్గితే అవి మరింత పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
దాదాపు అన్ని ఆసియా దేశాలలో ఎల్‌నినో ప్రభావం రెండో పంటపై పడుతుందని, దీంతో సాధారణ స్థాయి కంటే తక్కువగానే పంట దిగుబడి వస్తుందని, ఆ పరిస్థితుల్లో ధరలు మరింతగ పెరుగుతాయని ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్నందున ఒకే పంట వేయాల్సిందిగా థాయిలాండ్‌ ప్రభుత్వం రైతులను కోరింది. మన దేశంలో కూడా వేసవి పంట విస్తీర్ణం తగ్గింది. సాధారణం కంటే వర్షపాతం 8% తగ్గడమే దీనికి కారణం.
మన దేశంలో పాలక పక్షానికి ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ధరలను అదుపులో ఉంచేందుకు గత సంవత్సరం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. బియ్యం, చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు పెట్టింది. ఈ సంవత్సరం చివరలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనాలు వేసుకోవడం ఆలస్యం కావడం, మరోవైపు దేశంలో ధరలు పెరగడం ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని కలవరపెడుతోంది.ఈ నేపథ్యంలో ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దేశం ఆంక్షలు విధిస్తే ఇతర దేశాల సరఫరాలపై ప్రభావం పడుతుంది. సరఫరాలు సరిగా లేకపోవడం, భారత్‌ నుండి ఎగుమతులు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ధాన్యాన్ని కొని నిల్వ చేయడం కష్టమవుతుంది.

Spread the love