జులై 16 నుంచి షురూ
సమన్వయంతో పనిచేయాలి :
జూమ్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవం బోనాల పండుగ అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టే గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జులై 16న ప్రారంభమయ్యే ఉత్సవాలను ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌డి నుంచి బోనాల ఉత్సవాల నిర్వహణపై జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిష్టతో కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు. గత కొన్నేండ్లుగా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ నిధులను ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాట్లకు సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. భారీ రద్దీ ఉండే దేవాలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతల కోసం లాక్టేషన్ రూమ్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు ద్వారా బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి తాకిడి వుండే పరిస్థితుల నేపథ్యంలో ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయశాఖ పై, దేవాలయాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్దతో అధిక నిధులను అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించినందుకు సీఎంకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డీజీపీ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, ఆర్ అండ్ బీ, వాటర్ వర్క్స్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మెట్రో, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు పాల్గొన్నారు.



