Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇసుక కాంట్రాక్టర్లకు రూ.50 కోట్లు విడుదల

ఇసుక కాంట్రాక్టర్లకు రూ.50 కోట్లు విడుదల

- Advertisement -

రాష్ట్రంలో పారదర్శకంగా ఇసుక అమ్మకాలు
సాయంత్రం సమయంలో ర్యాండమైజేషన్ అమలు : టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి


నవతెలంగాణ-ఉప్పల్

రాష్ట్రంలోని ఇసుక కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్టు తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌‌లోని తన కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక ర్యాండమైజేషన్ బుకింగ్ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ఉదయం 9 గంటలతోపాటు సాయంత్రం 4 గంటలకు కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. దీంతో లారీ యజమానులందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కడా లేదని, కార్పొరేషన్ రోజుకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతోందని అన్నారు. అందులో సుమారు 0.63 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే బుక్ అవుతుండగా, 0.46 లక్షల మెట్రిక్ టన్నులు మిగులుతోందని వివరించారు.

ఇసుక కొరత ఉందని, “అవుట్ ఆఫ్ స్టాక్” చూపిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. టీజీఎండీసీ వద్ద విక్రయానికి 1.15 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ​ఇసుక బుకింగ్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ విధానంలో, సాండ్ సేల్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతోందని చెప్పారు. అన్ని బుకింగ్‌లు ముందుగా నిర్ణయించిన ప్రొటోకాల్స్ ప్రకారం ప్రాసెస్ అవుతాయని, ఆర్డర్ల కేటాయింపులో ఎలాంటి మానవ జోక్యమూ ఉండదని స్పష్టం చేశారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పెద్ద వినియోగదారుల అవసరాల కోసం బల్క్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అర్హత ప్రమాణాలు, బుకింగ్ పరిమితులు, చెల్లింపులు, కేటాయింపుల విధానం అన్ని దరఖాస్తుదారులకు సమానంగా వర్తిస్తాయని, ఎలాంటి వివక్ష ఉండదన్నారు. బల్క్ బుకింగ్ ఆమోదం అనంతరం ఒక రీచ్ నుంచి మరో రీచ్‌కు ఆర్డర్ బదిలీ కోరిన వినియోగదారులపై పైలట్ ప్రాతిపదికన రుసుములు, జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ఈ నెల 17 నుంచి ఇప్పటివరకు 83 ఆర్డర్లపై రూ.2.83 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ ఎల్లయ్యతోపాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -