మంత్రులు, ప్రముఖుల ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళల సాధికారత కోసం విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ప్రసంసించారు. బుధవారం హైదరాబాద్ లో వెటా ఇండియా చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ అవకాశమిస్తే మహిళలు అద్భుతాలు సృష్టించగలరని తెలిపారు. అందుకు వెటా వ్యవస్థాపకురాలు హనుమాండ్ల జాన్సీరెడ్డి మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. మహిళలు ఎదిగేందుకు కుటుంబాలు తోడ్పాటునం దించాలని ఆయన సూచించారు. వారు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బస్సులకు యజమానులను చేయడమే కాకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహిళా సాధికారత కోసం వెటా చేస్తున్న కృషిని ప్రశంసించారు. మహిళలకు ప్రతిభ, కష్టపడే గుణం ఉన్నప్పటికీ వాటి ఆధారంగా అవకాశాలు రావటం లేదన్నారు. మహిళ సాధికారత సాధించాలంటే ప్రభుత్వం, కుటుంబం, సమాజం సహాయం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నా ఆ పోస్టులు భర్తీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీనేజీ మ్యారేజీలు తగ్గించేందుకు ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు. జాన్సీ రెడ్డి మాట్లాడుతూ వెటా ద్వారా మహిళా సాధికారత కోసం వారికి ఒక సపోర్ట్ సిస్టమ్ , హెల్పింగ్ హ్యాండ్ లా ఉంటామనీ, విద్యా పరంగా, ఆరోగ్యం పరంగా అండగా నిలబడుతామని తెలిపారు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రజనీ మాట్లాడుతూ సమాజంలో మహిళలు మరింత రాణించాల్సిన అవసరముందని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళా ప్రముఖులకు హానరింగ్ ఇన్ స్పైర్ ఉమెన్ లీడర్స్ గా గుర్తించి సన్మానించారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు వెటా కృషి అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



