ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

– ఇటీవల విధుల నుంచి తొలగింపు
– డీఎం వేధింపులతో మనస్తాపం
– కుటుంబ సభ్యుల ఆరోపణ
నవతెలంగాణ-జహీరాబాద్‌
ప్రమాదానికి కారణమయ్యాడన్న కారణంతో ఇటీవల విధుల నుంచి తొలగించబడిన ఆర్టీసీ డ్రైవర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జహీరాబాద్‌ పట్టణంలో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని ఖాసీంపూర్‌ గ్రామానికి చెందిన నర్సింలు స్థానిక ఆర్టీసీ డిపోలో పర్మినెంట్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. రెండు నెలల కిందట నర్సింలు డ్రైవింగ్‌ చేస్తున్న బస్సు లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో వాహనాల ధ్వంసంతోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో బస్సు డ్రైవర్‌గా ఉన్న నర్సింలును నిందితుడిగా తేల్చి.. ఈనెల 9న సర్వీస్‌ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ‘కుటుంబ పోషణ భారం అవుతుంది.. నేను ఎలా బతకాలి’ అంటూ నర్సింలు కుటుంబ సభ్యుల వద్ద పలుమార్లు వాపోయాడు. ఆ క్రమంలోనే శుక్రవారం జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వేలైన్‌పై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా డీఎం సూర్యనారాయణ కక్ష సాధింపు చర్య వల్లే నర్సింలు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు.

Spread the love