వాడివేడిగా అఖిలపక్ష సమావేశం..ప్రతిపక్షాలు వాకౌట్
అసమ్మతి ఎంపీలను ఎలా పిలుస్తారు..సీపీఐ(ఎం)ఎంపీ జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ప్రభుత్వ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రతిపక్షాలు వాకౌట్ చేశారు. టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలకు చెందిన ‘నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)ని ఈ సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. లోక్‌సభలో వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం, స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి గుర్తింపు కల్పించేలా వ్యవహరించడంపై మండిపడ్డాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా శివసేన(ఠాక్రే) తిరుగుబాటు ఎంపీల విలీన అంశాన్నీ ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత నిర్ణయం పెండింగ్‌లో ఉన్న 20 మంది టీఎంసీ ‘రెబల్’ ఎంపిలకు ఈ ఎన్‌సీపీఐ ఒక ‘పార్కింగ్ ప్లేస్’ లాంటిదని, అలాంటి పార్టీని మోడీ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని నిరసిస్తూనే తాము వాకౌట్ చేశామని అన్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ అధికారికంగా గుర్తింపు లేని ఎన్‌సీపీఐ పేరుతో ఉన్న తిరుగుబాటు ఎంపీలను ఏ ప్రాతిపదికన సమావేశానికి పిలిచారని ప్రశ్నించారు. వారిపై ఉన్న అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రత్యేక బ్లాక్‌కు అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ చర్యకు నిరసనగానే ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయని చెప్పారు. “తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలకు ‘అఫిలియేషన్’ (అనుబంధ గుర్తింపు) కల్పించినట్లు స్పీకర్ పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనల్లో ఈ పదం ఎక్కడుంది? ఇలా గుర్తించడానికి రాజ్యాంగంలో గానీ, 10వ షెడ్యూల్‌లో గానీ ఎటువంటి నిబంధన లేదు. ఇది చట్టవిరుద్ధం. దీనిని నిరసిస్తూ మేము సమావేశం నుండి బయటకు వచ్చాము” అని శివసేన (ఠాక్రే) ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. ఆప్ ఎంపీ ఎన్‌డీ గుప్తా మాట్లాడుతూ “మా పార్టీ విషయంలో రాజ్యసభలోని 10 మంది ఎంపిలలో 7 మందిని హైజాక్ చేశారు. ఇది చెల్లుబాటు అవుతుందో లేదో తేల్చడానికి మేము వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అయినప్పటికీ, వారు రాజ్యసభలో స్వతంత్ర ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి, హత్య చేయడమే” అన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా అభివర్ణించారు. “అసమ్మతి ఎంపీలను ఆహ్వానించడం అఖిలపక్ష సమావేశం పవిత్రతకు విరుద్ధం. మేము దీనిని నిరసిస్తున్నాము” అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ “ఎన్‌సీపీఐకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఒక కొత్త పార్టీలో చేరాలని, పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు అభ్యర్థనను సమర్పించారు. ఇది నిబంధనలకు అనుగుణంగానే ఉంది. ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉంది. 20 మంది ఎంపీలతో కూడిన వ్యవహారం అయినప్పుడు, వారిని ఎలా పక్కనపెట్టగలం? ఈ 20మంది ఎంపీలను మనం ఎలా ఆహ్వానించకుండా ఉండగలం? గుర్తింపు అనేది ఒక విధానపరమైన అంశం. లోక్‌సభ స్పీకర్ సచివాలయం తీసుకునే చర్యలపై నేను వ్యాఖ్యానించను. అన్ని పార్టీలతో సంప్ర దింపులు జరపడం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ఏకాభిప్రాయం సాధించాలంటే అందరినీ ఆహ్వానించాల్సిందే. నేను ఎవరినైనా ఎలా మినహాయించగలను?” అని అన్నారు.
రాజ్ నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
ఆదివారం నాడిక్కడ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ఎనెక్స్ భవన్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నాయకులు హాజరయ్యారు. ఈ భేటీలో అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం, నీట్ పేపర్ లీక్, పెట్రోల్‌లో ఈ20 ఇంధన మిశ్రమం వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మణిపుర్‌లో పరిస్థితులపైనా చర్చించాలని కోరినట్టు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తోన్న నిరసనపై కూడా చర్చ జరగాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల బలంతోనే అమలు చేయాలని డీఎంకే కోరింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు కోరాయి.



