పల్లె దవా’ఖాళీ’లు..

Rural medicine 'vacancies'..– వ్యాధుల కాలం వచ్చేసింది.. దృష్టి పెట్టని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌
– రాష్ట్రవ్యాప్తంగా 4వేలకు పైగా ఆస్పత్రుల్లో సగం మందే డాక్టర్లు
– భర్తీకి పలుమార్లు నోటిఫికేషన్లు ఇస్తున్నా ముందుకు రాని వైద్యులు
– ఇటు డాక్టర్లు.. అటు సహాయక సిబ్బంది లేక అక్కడక్కడ మూత
గత ప్రభుత్వం ప్రారంభించిన పల్లె దవాఖానలకు ఖాళీల జబ్బు పట్టుకుంది. పలుమార్లు నోటిఫికేషన్లు వేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రాకపోవడంతో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్స్‌ అలంకారప్రాయంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా దవాఖానలు ఉండగా సగం చోట్లనే డాక్టర్లు ఉండటం గమనార్హం.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం:
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్‌ సబ్‌సెంటర్లను ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి అందులో ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను పెట్టాలని నిర్ణయించింది. కానీ రూరల్‌ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. దాంతో ఆయుష్‌ వైద్యులు (ఆయుర్వేదం), చివరకు స్టాఫ్‌నర్స్‌తోనైనా సరిపెట్టాలనుకుంది. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా దవాఖానాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలుమార్లు నోటిఫికేషన్లు వేస్తున్నా ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 27 చోట్ల పూర్తిగా ఖాళీలు ఉండటం గమనార్హం.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4,830 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పల్లె దవాఖానాలుగా 2021లో నాటి రాష్ట్రప్రభుత్వం మార్చింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుగా ఉన్నప్పుడు ఒక ఏఎన్‌ఎం మాత్రమే ఉండేవారు. ఆమెకు ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించేవారు. దీనివల్ల రోగాలు ముమ్మరంగా వచ్చే వర్షాకాలంలో ఏరియా, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులపై భారం పడేది. ఓపీ విపరీతంగా ఉండటంతో జ్వరం వంటివాటికి గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్యసేవలు అందేలా ప్రభుత్వం పల్లెదవాఖానాల రూపంలో ప్రణాళిక చేసింది. వీటిలో ఒక డాక్టర్‌, ఫస్ట్‌ ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంను స్టాఫ్‌గా నిర్ధారించారు. ఎంబీబీఎస్‌ వైద్యులు లేనిచోట మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ)ను నియమించారు. బీఎస్సీ నర్సింగ్‌, బీఏఎంఎస్‌ అభ్యర్థులను వైద్యులుగా ఎంపిక చేస్తున్నారు. వారు పట్టణాల్లో ప్రభుత్వ నియామకాల్లో ఎంపిక కావడంతో కొందరు వెళ్లి పోతుంటే.. పీజీ సీట్లు రావడంతో మరికొందరు రిజైన్‌ చేస్తున్నారు. పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలకు కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వేతనం చెల్లిస్తుంది. కానీ కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాలేదన్న సాకుతో వేతనాలు నిలిపివేస్తుండటంతో వైద్యులు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది పల్లె దవాఖానాలపై విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలతో వచ్చిన వారికి పల్లెదవాఖానాల్లో మందులు అందిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.
భద్రాద్రిలో 27.. ఖమ్మంలో 11 చోట్ల ఖాళీలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 153 పల్లె దవాఖానాలు ఉండగా వివిధ పీహెచ్‌సీల పరిధిలో కాచంపల్లి, వరాయిగూడెం, వెడతపురం, తుంగారం, దోసిల్లపల్లి, నాచారం, గట్టుగూడెం, ఎర్రగుంట, పెంటలం, అనంతారం, గశెట్టిపల్లి, కొమ్ముగూడెం, కే.గంగారం, పొగిళ్లపల్లి, తిమ్మంపేట, మణుగూరు భగత్‌సింగ్‌నగర్‌, పగిడేరు, సుందరయ్యనగర్‌, ముత్యాలంపేట, రాజీవ్‌నగర్‌ కాలనీ, పట్వారీగూడెం లింగంపల్లి, పెనగడప త్రీ ఇంక్లైన్‌, రేగళ్ల చాతకొండ-1,రొంపేడు 24 పిట్‌, రాగబోయినగూడెం, సత్యనారాయణపురం, ఉల్వనూరు కిన్నెరసానిలో ఎంఎల్‌హెచ్‌పీలు లేరు. ఖమ్మం జిల్లాలో 161 పల్లెదవాఖానలు ఉండగా వాటిలో 63 చోట్ల ఖాళీలు ఉండటంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్‌ వేశారు. వీటిలో కొన్ని భర్తీ కాగా ఇప్పటికీ 11 చోట్ల పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. నాటి నోటిఫికేషన్‌లో ఎంపికైన కొందరు ఇంకా జాయిన్‌ కాలేదు. ఆ ఖాళీలు కూడా అలానే ఉంటున్నాయి.
ఒక్కో దవాఖాన నిర్మాణానికి రూ.20 లక్షలు..
చాలా చోట్ల పల్లె దవాఖానలు పాత పంచాయతీ భవనాలు, స్కూల్‌ బిల్డింగ్‌లు, గ్రంథాలయాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.20 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నూతన బిల్డింగ్‌లను నిర్మిస్తున్నారు. ఈ దవాఖానాలో మూడు గదులు, ఓ స్టోర్‌ రూం.. మొత్తం 1020 చదరపు అడుగులు ఉండేలా వీటిని డిజైన్‌ చేశారు.
మూతపడిన మల్లెమడుగు పల్లె దవాఖాన
రూ.20 లక్షల వ్యయంతో ఖమ్మం సమీపంలోని రామన్నపేట కాలనీలో నిర్మించిన మల్లెమడుగు పల్లెదవాఖానలో సిబ్బంది ఎవరూ లేరు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఆస్పత్రిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఏడాది జనవరి 10వ తేదీన ప్రారంభించారు. ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం-1, ఏఎన్‌ఎం-2 పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఇది నాటి నుంచి మూతబడే ఉంటోంది. అప్పుడప్పుడు స్థానిక ఆశా కార్యకర్త వచ్చి కాసేపు ఉండి వెళ్తోంది. ఖమ్మం జిల్లాలో ఇలా 11 పూర్తిస్థాయి ఖాళీలతో అలంకారప్రాయంగా ఉంటున్నాయి. ఖమ్మానికి సమీపంలో ఉన్న ఈ హాస్పిటల్‌లో పోస్టులు భర్తీ కాకపోవడం గమనార్హం.

Spread the love