‘కమలం’.. కలవరం

'Lotus'.. confused– గౌరవప్రద ఓట్ల కోసం టీడీపీతో ‘బేరం’
– ఆంధ్రాలో పొత్తును సాకుగా చూపి ఖమ్మంలో మద్దతుకు యత్నాలు
– తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు
– ఎన్నికలకు వారముండగా ఇప్పుడీ మద్దతేంటని ప్రశ్న
– అసెంబ్లీ తరహాలోనే కాంగ్రెస్‌తోనే అంటున్న మెజార్టీ క్యాడర్‌
”రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సిద్ధాంతాన్ని నమ్మిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ఏ పార్టీ మద్దతు లేకుండానే ఖమ్మంలో కాషాయ జెండా ఎగురవేస్తానని ప్రకటించారు. చివరకు గౌరవప్రద ఓట్లు దక్కితే చాలనే స్థాయికి వచ్చారు. ఒంటరిగా వెళ్తే కనీస ఓట్లూ రావని ఎన్నికలు వారం ఉండగా టీడీపీ ఆఫీస్‌ మెట్లెక్కారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. ఆయనిచ్చే ఎంగిలి డబ్బులకు ఆశ పడేవాళ్లం కాదంటున్నారు ఆ పార్టీ నాయకులు. తమకూ రాజకీయాలు తెలుసని టీడీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అంటున్నారు.” ఈ అంశం తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలకు దారితీసింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ‘కమలం’ శ్రేణుల్లో కలవరం నెలకొంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాల కన్నా కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ కోటగా చెప్పుకునే ఖమ్మంలో పాగా వేయాలని ఆ పార్టీ ఎత్తుగడ వేసింది. ఇందుకోసం సంపన్నుడైన తాండ్ర వినోద్‌రావును అభ్యర్థిగా ఎంచుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని ప్రకటించడం ఆలస్యమయ్యే సరికి.. రకరకాల అంచనాలతో ఉత్సాహంగా ప్రచారం నిర్వహించింది. ఒక దశలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న నామ నాగేశ్వరరావును తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలూ బీజేపీ నాయకత్వం చేసింది. ఎలాంటి పొత్తులు లేకుండానే ఒంటరిగా బరిలో ఉంటామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఇప్పుడు ఖమ్మంలో టీడీపీతో జట్టు కట్టేందుకు నియోజకవర్గ నాయకత్వానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టుంది. గౌరవప్రదమైన ఓట్లు దక్కాలంటే ఏదో ఒక పార్టీతో జత కట్టక తప్పని స్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులను సాకుగా చూపి టీడీపీని తమ వైపు తిప్పుకునే యత్నాలు చేస్తోంది. ఎన్నికలకు సరిగ్గా వారం ఉందనగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయానికి మంగళవారం వెళ్లిన బీజేపీ నాయకత్వం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా మద్దతు కోరింది. పనిలో పనిగా బుధవారం టీడీపీతో, బీజేపీ కలిసి ఖమ్మంలో ర్యాలీ తీసింది. దీనికి టీడీపీ మెజార్టీ నాయకత్వం, కేడర్‌ దూరంగానే ఉంది.
బీజేపీతో పొత్తుకు మెజార్టీ టీడీపీ క్యాడర్‌ విముఖత
బీజేపీతో పొత్తుకు మెజార్టీ టీడీపీ క్యాడర్‌ విముఖత వ్యక్తం చేస్తోంది. జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం గ్రూపు మినహా మిగిలిన వారు దీనిపై విముఖతతోనే ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి టీడీపీ ఆఫీస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లు సహా సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం ఇన్‌చార్జీలు దూరంగానే ఉన్నారు. మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి రామనాథంతో పాటు వైరా, పాలేరు ఇన్‌చార్జీలు చెరుకూరి చలపతిరావు, కొండబాల కరుణాకర్‌ మాత్రమే హాజరయ్యారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీలో రామనాథం మినహా మిగిలిన వారు కనిపించక పోవడం గమనార్హం. అశ్వారావుపేట ఇన్‌చార్జి స్వామి బీజేపీతో కలిసేది లేదని పత్రికాముఖంగా ప్రకటించారు. ఇంకా మెజార్టీ నాయకత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. టీడీపీ జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో వివిధ హౌదాలో ఉన్న అనేక మంది బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. వినోద్‌రావు ఇచ్చే డబ్బులకు ఆశపడి తమ పార్టీలో కొందరు ఎన్నికలు వారం ఉన్నాయనగా బీజేపీతో కలిసి వెళ్తున్నారని.. దీనికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆదేశాలు ఉన్నట్టు ‘మసిపూసి మారేడు కాయ’ చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్‌ వైపే మెజార్టీ క్యాడర్‌ మొగ్గు..
ఖమ్మం లోక్‌సభ పరిధిలో టీడీపీకి 50వేలకు పైగా కచ్చితమైన ఓటు బ్యాంక్‌ ఉంది. వీరిలో 80శాతం మందికి పైగా కాంగ్రెస్‌తోనే కలిసి వెళ్లాలనే అభిప్రాయాన్ని వివిధ సందర్భాల్లో వెలిబుచ్చుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారు అయిన వెంటనే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. ఐదారు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సైతం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించి తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైందని.. తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి సపోర్టుగా నిలవాలనే అభిప్రాయంతో మెజార్టీ టీడీపీ కేడర్‌ ఉన్న విషయాన్ని పసిగట్టిన బీజేపీ నాయకత్వం ఎలాగైనా ఆ పార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేనిది బీజేపీ ఖమ్మంలోనే తమతో కలవాలని ఒత్తిడి చేస్తుండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆంధ్రా రాజకీయాలతో ముడిపెట్టి తమను లొంగదీసుకోవాలనే ప్రయత్నాలను మెజార్టీ నాయకత్వం, కేడర్‌ వ్యతిరేకిస్తోంది. మోడీ మార్కు రాజకీయాలు ఖమ్మంలో సాగవని, ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Spread the love