ఏమార్చిన కమలం

What a lotus– పదేండ్లలో బీజేపీ ఒక్కటీ చేయలేదు..
– వనరులున్నా ‘ఉక్కు’ సంకల్పం లేదు.
– గనుల ప్రయివేటీకరణతో సింగరేణికి ముప్పు
– విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణతో ‘మాధారం డోలమైట్‌’ ప్రశ్నార్థకం
– లోక్‌సభ ఎన్నికల వేళ వనరుల సద్వినియోగంపై బీజేపీ ఓట్ల మాటలు
బీజేపీ ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలుపుకోలేదు. లోక్‌సభ ఎన్నికల వేళ ఆ పార్టీ అభ్యర్థులు, జాతీయ నేతలు వల్లిస్తున్న మాటలు విని జనం నవ్వుతున్నారు. ఈ పదేండ్లలో ఏమీ చేయకపోగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి గనులను ప్రయివేటీకరించడంతో ఇప్పుడు ఆ సంస్థ అస్థిత్వానికే ముప్పు ఏర్పడింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అనేక ఖనిజ నిక్షేపాలున్నా వాటి సద్వినియోగానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, మహబూబాబాద్‌ అభ్యర్థి సీతారాంనాయక్‌ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై మాట్లాడుతున్న తీరు విస్తుగొల్పుతోంది. గెలిపిస్తే చేస్తామని హామీ ఇస్తారనుకున్నా.. కేంద్రంలో ఇప్పటిదాకా ఆ పార్టీయే అధికారంలో ఉండి ఎందుకు చేయలేదన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కరీంనగర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులే ఎంపీలుగా ఉన్నారు. ఏ ఒక్క పరిశ్రమైనా నెలకొల్పారా…? పసుపుబోర్డును ఏర్పాటు చేశారా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పారా? మాధారం డోలమైట్‌ గనులను ప్రయివేటీకరించడం ఆపారా..? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో ఆ పార్టీ అభ్యర్థులు, నేతల నుంచి సమాధానం లేదు. ఎందుకు చేయలేక పోయామనేది గెలిచిన వారు గానీ, ప్రచారానికి వస్తున్న వారు కానీ అమలుపై చెప్పడం లేదు.
ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు..
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పుతామన్న హామీని బీజేపీ నిలుపుకోలేకపోయింది. పైపెచ్చు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీనిపై చేసిన వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం వివాదాస్పదమయ్యాయి. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఆధ్వర్యంలో రూ.36వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఈ పదేండ్లలో దాని ఊసే ఎత్తలేదు. దీని ద్వారా 30వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఉత్తిదే అయ్యింది. చివరకు రెండేండ్ల క్రితం కేంద్రమంత్రి ఈ ఫ్యాక్టరీతో ఎలాంటి ఉపయోగం లేదనే రీతిలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ముడిఖనిజం ఉన్నా నేరవేరని హామీ..
ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 56వేలకు పైగా హెక్టార్లలో ఖనిజ నిక్షేపాలున్నట్లు జియాలాజికల్‌ సర్వే అధికారులు గుర్తించారు. దేశంలో 11 శాతం ఖనిజ నిక్షేపాలు ఈ ప్రాంతాల్లోనే లభ్యమవుతున్నట్టు నివేదికలు ఇచ్చారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు, ఖమ్మం జిల్లా కారేపల్లి, నేలకొండపల్లి, కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి, భద్రాచలం నియోజకవర్గంలో దాదాపు వంద కోట్ల టన్నుల ఇనుపఖనిజం ఉన్నట్లు అంచనా వేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అవసరమైన బొగ్గు, డోలమైట్‌, ముడిఇనుము విద్యుత్‌, నీరు, రైలుమార్గం ఉన్నా సర్వేల పేరుతో కాలయాపనే చేస్తున్నారు.
గనుల ప్రయివేటీకరణతో ముప్పు..
బొగ్గు గనుల ప్రయివేటీకరణతో సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మైన్స్‌ అండ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌ యాక్టు 1957కు సవరణలు చేసి దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను టెండర్ల ద్వారా ప్రయివేట్‌పరం చేసే చర్యలు ప్రారంభించారు. గనుల ప్రయివేటీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రతిఘటించినా తగిన సంఖ్యా బలం లేకపోవడంతో నాలుగు బొగ్గు బ్లాకులు ప్రయివేటు టెండర్లుగా మారాయి. సత్తుపల్లి బ్లాక్‌-3, కోయగూడెం బ్లాక్‌-3, కల్యాణఖని బ్లాక్‌ 6, శ్రావణపల్లి బగ్గుగనులను కేంద్రం టెండర్ల ప్రక్రియలో చేర్చింది. ఈ నేపథ్యంలో నూతన గనుల టెండర్లలో సింగరేణి సంస్థ కూడా ప్రయివేటుతో పోటీ పడాల్సి ఉంటుంది.
విశాఖ స్టీల్‌ ప్రయివేటీకరణతో ‘మాధారం డోలమైట్‌’ ప్రశ్నార్థకం
”భూమినిచ్చాడా.. పునాది తీశాడా.. అమ్మేటోడెవడురా మన ఉక్కునూ.. చెమట చిందించాడా..? కండ కరిగించాడా..? కోనేటోడెవడురా..? మన ప్లాంట్‌నూ.. ఉక్కునూ కాపాడి మరో పోరాటానికి అడుగుముందుకెయ్యరా…ఆంధ్రుడా! అమ్ముకునే హక్కు మోడీకెక్కడదని కళ్లెర్రజెయ్యరా? ఆంధ్రుడా..!!” అంటూ.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, మాధారంలోని డోలమైట్‌ గనుల ప్రాంతంలో వీఎస్పీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 2021లో రోజుల తరబడి ఆందోళనలు కొనసాగాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మూలాధారమైన మాధారం డోలమైట్‌ కర్మాగారం కోసం 1989లో కారేపల్లి, గార్ల మండలాలకు చెందిన 227 మంది రైతులు 956.30 ఎకరాలను ఫ్యాక్టరీ కోసం ధారాదత్తం చేశారు. ప్రజల త్యాగంతో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీని యాజమాన్యం ప్రయివేటు చేతుల్లో పెట్టింది. గాయత్రి కన్‌స్ట్రక్షన్స్‌, కూవ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, టెంపో, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ వంటి సంస్థలకు కట్టబెట్టింది.
కార్మికుల భవితవ్యం ఆందోళనకరం
బొగ్గుగని కార్మికుల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రద్దు, కోల్‌ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా కార్మికుల ఆదాయ పన్ను యాజమాన్యాలు చెల్లించే విధానాన్ని సాధించలేకపోయారన్న ఆవేదన కార్మికుల్లో ఉంది. బీఎంఎఫ్‌టీ, కోల్‌బెల్ట్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ ఫండ్‌ పేరుతో రూ.వేల కోట్లు వసూలు చేస్తున్నా కార్మికుల భవితవ్యాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆవేదనతో ఉన్నారు. ఇలా ఇచ్చే హామీలకు చేసే పనులకు పొంతన లేకుండా బీజేపీ ఏ మార్చుతూనే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.

Spread the love