చేయందుకునేందుకు ఢిల్లీకి షర్మిల..!

– నేడు రాహుల్‌, ఖర్గేతో భేటీ?
– కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్టీపీ విలీనం!
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వైయస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు ఆమె శుక్రవారం బెంగుళూరు నుంచి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని తెలిసింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమేనని, పార్టీ విలీనం పైనే చర్చించేందుకు ఆమె ఢిల్లీ వెళ్లారని ఖమ్మం జిల్లాలోని షర్మిల అనుచరులు అంటున్నారు. ఆ పార్టీ అగ్రనేతలతో శనివారం ఆమె భేటీ అవుతారని చెబుతున్నారు. సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఎలాంటి షరతులు లేకుండానే తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌ వైపు నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. అయితే ఆమె కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పార్టీ ఏవిధంగా ఉపయోగించుకుంటుందనే ఆసక్తి నెలకొన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్‌ స్థానాలు మాత్రమే ఉండగా టిక్కెట్‌ విషయంలో వీటికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో షర్మిలను సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయిస్తారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. లేదంటే ఖమ్మం పార్లమెంటుకు పోటీ ఛాన్స్‌ ఉందని అంటున్నారు. షర్మిల చేరిక రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింతగా పుంజుకునేందుకు దోహదపడుతుందని ఒక గ్రూపు అంటుండగా మరో గ్రూపు ఆమెను ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అభివద్ధికి ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.

Spread the love