40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి– పీఆర్సీ చైర్మెన్‌కు టీఆర్టీఎఫ్‌ ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 40 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీని ఇవ్వాలని టీఆర్టీఎఫ్‌ కోరింది. ఈ మేరకు పీఆర్సీ చైర్మెన్‌ ఎన్‌ శివశంకర్‌, సభ్యులు బి రామయ్యకు మంగళవారం హైదరాబాద్‌లో వేతన సవరణ ప్రతిపాదనలను ఆ సంఘం గౌరవాధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్‌, చీఫ్‌ ప్యాటర్న్‌ లక్కిరెడ్డి సంజీవరెడ్డి నేతృత్వంలో సమర్పించారు. 2022-23 జాతీయ వార్షిక ద్రవ్యోల్బణ రేటు 6.8 శాతం, తెలంగాణలో 8.7 శాతం ఉందని తెలిపారు. ఈ కారణంగా వస్తువు సేవల ధరలు ఊహించనంతగా పెరిగాయని పేర్కొన్నారు.కొనుగోలు శక్తి తగ్గి ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిజవేతనాలు పడిపోతున్నాయని వివరించారు. సీపీఎస్‌ రద్దుకు పీఆర్సీ కమిటీ సిఫారసు చేయాలని కోరారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించాలని సూచించారు. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ రూ.28 లక్షలుండాలని తెలిపారు. అప్రయత్న పదోన్నతి 5/10/15/20/25 ఏండ్లుగా మార్చాలని పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత పద్ధతిని పునరుద్ధరించి మారుమూల ప్రాంతాల్లో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్‌ నాయకులు సుంకిశీల ప్రభాకర్‌రావు, మారెడ్డి అంజిరెడ్డి తున్నూరి సురేష్‌, షడ్రక్‌, కుషాల్‌, ప్రణీత్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love