భువనగిరిలో సీపీఐ(ఎం)ను గెలిపించాలి

CPI(M) should win in Bhuvangiri– మోడీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం
– దేశంలో ఇక ఎన్నికలనేవే ఉండవు
– ప్రజాస్వామ్య భారతం ప్రశ్నార్థకమవుతుంది
– అందుకే బీజేపీని చిత్తుగా ఓడించాలి
– బీజేపీ తేవాలనుకున్న కార్పొరేట్‌ రాజ్యాన్ని అడ్డుకోవాలి
– మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌ను బలపరుస్తున్నాం..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– ఇబ్రహీంపట్నంలో అభ్యర్థి జహంగీర్‌తో కలిసి రోడ్‌షో
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేశంలో మూడోసారి మోడీ గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇక ఎన్నికలనేవే ఉండబోవని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, అందుకే బీజేపీని చిత్తుగా ఓడించాలని తెలిపారు. భువనగిరిలో సీపీఐ(ఎం)ను గెలిపించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అభ్యర్థి జహంగీర్‌తో కలిసి రోడ్డు షో నిర్వహించారు. ఉదయం ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో ప్రారంభమైన భైక్‌ ర్యాలీ.. పోల్కంపల్లి, జాజోని బావులు, నెర్రపల్లి, దండుమైలారం, ముకునూరు, రాయపోలు గ్రామాల్లో ప్రచారం చేసింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే మోడీ మళ్ళీ అధికారంలోకి రావొద్దన్నారు. కులమత తారతమ్యం లేకుండా జీవిస్తున్న లౌకిక రాజ్యాన్ని సమాధి చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కార్పొరేట్‌ రాజ్యాన్ని తీసుకొచ్చి, మనువాద సిద్ధాంతాన్ని రాజ్యాంగంగా మార్చే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అందుకే దేశంలో బీజేపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే దేశంలోని 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. భువనగిరిలో తాము పోటీ చేస్తున్నామని, సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. మిగిలిన స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ను బలపరుస్తున్నామని చెప్పారు. బీసీ నినాదం అందుకున్న బీజేపీ గడిచిన పదేండ్లలో బీసీ గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ గణన చేయాలని కోరుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ గడిచిన పదేండ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని తెలిపారు. ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్లు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని, దాంతో నిరుద్యోగం పెరిగిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో నాలుగు నల్ల చట్టాలు తీసుకువచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని విమర్శించారు. 2022 వరకు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎందుకు ఇంకా పేదలు ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను జేబు సంస్థలుగా మలుచుకొని ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులపై సైతం కేసులు విధిస్తూ జైలుపాలు చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, జార్ఖండ్‌ ముఖ్యమంత్రుల ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని, బీజేపీలోని నాయకులపై ఎందుకు ఆ సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 2006లో వామపక్షాల ఉద్యమ ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. దాన్ని సైతం మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ తరుణంలో మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందుకనే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌, యాదయ్య, జగదీష్‌, కవిత, జిల్లా కమిటీ సభ్యులు జగన్‌, సీహెచ్‌ జంగయ్య, శ్యాంసుందర్‌, శ్రీనివాసరెడ్డి, అంజయ్య, ఏర్పుల నర్సింహ, దుబ్బాక రాంచందర్‌, ఆలంపల్లి నర్సింహ, ఆయా ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love