క్షేమంగానే.. టన్నెల్‌లో ఎండోస్కోప్‌ కెమేరా ద్వారా కార్మికుల గుర్తింపు

All right.. Identification of workers through endoscope camera in tunnel– ఉత్తరకాశీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. నవంబర్‌ 12న నిర్మాణంలో ఉన్న టన్నెల్‌ కూలిపోవ డంతో.. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పది రోజులుగా వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా, సోమవారం రాత్రి వీరు చిక్కుకున్న ప్రదేశంలోకి ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్‌లో ఎండోస్కోపీ తరహా కెమెరాను ఉంచారు. క్యాప్‌లు, డ్రస్‌లతో ఉన్న కార్మికులు కెమెరాలో కనిపించారు. తాము బాగానే ఉన్నామని చెప్పేందుకు యత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కెమెరా ముందుకు వచ్చి వాకీ టాకీ ద్వారా మాతో మాట్లాడండి అని ఓ అధికారి వారిని కోరడం వినిపిస్తున్నది. సోమవారం రాత్రి ఈ గొట్టం ద్వారా కిచిడీ, ఇతర ఆహార పదార్థాలను పంపించారు. కార్మికులకు త్వరలో మొబైల్స్‌, ఛార్జర్లను పైపు ద్వారా పంపిస్తామని రెస్క్యూ ఆపరేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ కల్నల్‌ దీపక్‌ పాటిల్‌ తెలిపారు. కొండరాళ్లు విరిగి పడటం, స్థలాకృతి, రాళ్ల స్వభావం కారణంగా గత కొన్ని రోజులుగా కార్మికులను రక్షించే ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అన్నారు. చిక్కుకున్న కార్మికులను చేరుకునేందుకు ఐదంచెల కార్యచరణ ప్రణాళికను రూపొందించామని, ఒక్కో ఆపరేషన్‌ను ఐదు ఏజన్సీలకు అప్పగించామని చెప్పారు. ప్రధాన సొరంగం కుడి, ఎడమ వైపు నుంచి రెండు సొరంగాలు తవ్వుతున్నామని, సొరంగంపై నుంచి కూడా డ్రిల్లింగ్‌ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే కూలీలంతా క్షేమంగా బయటకు వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love