కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై
సమీక్షలో సీఎం దిశానిర్దేశం
డిజిటల్ గవర్నెన్స్‌తో సమస్యలకు చెక్ పెట్టండి
‘కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్’పై సమీక్షలో సీఎం దిశానిర్దేశం
వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ శాఖలు, రంగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వారందరికీ ప్రతీనెలా ఐదో తేదీలోగా వేతనాలివ్వా ల్సిందేనని ఆయన ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా వాటికి చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెఆర్డీలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, అవి సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందనీ, అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి ఐదో తేదీలోగా పారదర్శకంగా జీతాలను చెల్లించేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సూచించారు. అందుకే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.
ఇందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ వంద రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తేవాలని సూచించారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిపాలనలో మరింత పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా ముందుకు సాగాలని సీఎం కోరారు. ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయడంతోపాటు అవసరమైన చట్టాలను రూపొం దించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగప డుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ విభాగాల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రధాన కార్యదర్శి వి శేషాద్రి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మెన్ శాంతి కుమారి, వేతన సవరణ కమిషన్ చైర్మెన్ ఎన్ శివశంకర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా విభాగం కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



