కార్మిక జీవులకు సలాం.!

– రేపు కార్మిక దినోత్సవం..
– కార్మికులను కీర్తించని గళం.. కలం లేదు..
– నేటికీ అందని సంక్షేమ ఫలాలు- కార్మిక చట్టాలు..
– కార్మికుల హక్కులు కనుమరుగవుతున్నాయి..
– సీపీఐ(ఎం)జిల్లా కమిటీ మెంబర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సెక్రెటరీ.. ముక్తికాంత అశోక్..
– కార్మిక వ్యతిరేకి బీజేపీ.. 
– మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి  గుర్రం అశోక్..
నవతెలంగాణ – వేములవాడ 
కష్టం వారి జీవనాధారం.. శ్రమ వారి పెట్టుబడి.. కండలతో కొండలను పిండి చేసేందుకు చెమటను దార పోసే శ్రమజీవి కార్మికుడు.. ఇటుక బట్టీల్లో, కోళ్ల ఫారం లో, పారిశుద్ధ కార్మికులు, బీడీ కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, హమాలీలు, కాంట్రాక్టర్ కార్మికులు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం లేదు.. శ్రమ దోపిడి తప్ప కార్మికుడికి పూర్తిస్థాయిలో పనికి తగిన  వేతనంలో పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదు.. “మే డే “రాగానే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కార్మికులను కీర్తిస్తూ.. శ్రమకు జై జైలు పలకని నాయకుడు అంటూ ఉండరు.. మునిసిపల్, గ్రామపంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ప్రతినెల అందాల్సిన జీతభత్యాలు అందడం లేదు.. కార్మిక చట్టాల ద్వారా వచ్చే బెనిఫిట్స్ సరిగా అందడం లేదని విమర్శలు ఉన్నాయి.. “మే డే కార్మిక జీవులకు సలాం..! నవతెలంగాణ ప్రత్యేక కథనం”..
అందని సంక్షేమ ఫలాలు- కార్మిక చట్టాలు..
ఉపాధి, కార్మిక భద్రత అవకాశాలు కలగానే మిగులుతుంది ,కండలను కరిగించిన కనీస వేతనం శ్రమజీవి  కార్మికుడికి దక్కడం లేదు. పనికి తగిన సమాన వేతనం పని వేళలు వారంత సెలవులు ఇలాంటివి నేటికీ చాలా మట్టుకు అందని ద్రాక్షగానే కార్మికులకు  వేదనను కలిగిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలావరకు ప్రైవేటీకరణం చేయడంతో కార్మికుల హక్కులను లాక్కుంటున్నారని మేధావి వర్గం గగ్గోలు పెడుతున్నారు. మే డే వస్తుంది, పోతుంది.. జెండాలు ఎగరేస్తారు..జై జైలు పలుకుతారు.. బాక్సులు బద్దలు అయ్యేలా స్పీచ్ లు ఇస్తారు, ఆ ఒక్క రోజు వరకు మాత్రమే. కార్మికుల బతుకుల్లో మార్పు రావడం లేదు, పేదవాడు పేదవాడిలాగే  ఉండిపోతున్నారు. బిజెపి ప్రధాని మోడీ 2019లో 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కార్మిక కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల శక్తిని దెబ్బతీస్తున్నారని కార్మిక సంఘాలు ఘోషిస్తున్నాయి. ఇటుక బట్టీల్లో, కోళ్ల ఫారం లో, పారిశుద్ధ కార్మికులు, బీడీ కార్మికులు , బిల్డింగ్ కార్మికులు, హమాలీలు, కాంట్రాక్టర్ కార్మికులు పరిశ్రమల కార్మికుల శ్రమశక్తి మాత్రం దోపిడీకి గురవుతుంది. కార్మిక సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటి గురించి ఏ ఒక్క కార్మికునికి సరైన అవగాహన లేదు, కార్మికులు ఎక్కువ మట్టుకు చదువు రాని వారు కనుక ఈ పథకాలు వారికి చేరడం లేదు అనే విమర్శలు చాలానే ఉన్నాయి. కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు పోరాడితే తప్ప కార్మికులకు ఫలాలు దక్కడం లేదు.
కార్మిక వ్యతిరేకి బీజేపీ: మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి  గుర్రం అశోక్..
కార్మికుల హక్కుల కోసం మే డే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలి.  ప్రధాని మోడీ 44 కార్మిక చట్టాలని రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కార్మిక కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల శక్తిని శ్రమను దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నారు. బడా కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..
కార్మికుల హక్కులు కనుమరుగవుతున్నాయి: సీపీఐ(ఎం) జిల్లా కమిటీ మెంబర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సెక్రెటరీ.. ముక్తికాంత అశోక్..
ప్రస్తుత పాలకుల విధానాలు పాత హక్కులన్నీ హరించివేస్తుండడం కార్మికులను కలవరపరుస్తోంది. పాలకులు వ్యవస్థ మారుతుంటే కార్మికుల హక్కులు, సంక్షేమ చట్టాలు మరిన్ని అమలు కావాల్సి ఉండగా దానికి విరుద్దంగా పరిస్థితి మారుతోంది. ప్రత్యేకించి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, కార్మిక విధానాలు దేశ వ్యాప్తంగా కార్మికవర్గాన్ని ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
Spread the love