కేసీఆర్ కు అధికారం పోగానే ప్రజలు గుర్తుకు వస్తున్నారు..

– మీలో ఒకడిగా ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
– రేవంత్ రెడ్డి సర్కార్ ను  టచ్ చేయడం మీ వల్ల కాదు..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
రేవంత్ రెడ్డి సర్కార్ ను ముట్టుకోవడం మీ వల్ల కాదని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ  లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికుల్ల పనిచేయాలన్నారు.దేశంలో మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి భాజపాకి వ్యతిరేకంగా ఉందని తెలిసి నరేంద్ర మోడీలో ప్రస్టేషన్కు లోనై గతంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసి ప్రధాని హోదాను మరిచి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు.ముస్లింలకి ఆస్తి పంచుతారని అనడం, తాళిబొట్లు లాక్కుంటారని బీజేపీ మాట్లాడే మాటలు చూస్తే బీజేపీకి ఓడిపోతామని భయం పట్టుకుందన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగన్ని అమలు చేస్తానని ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ భాగోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. జన్ దన్ ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోసం చేశారని, జీఎస్టీ పేరిట పేద ప్రజలను దోచుకుంటున్నారని ఎన్నికల్లో బిజెపి వారు మతాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలని చూస్తుందన్నారు. శ్రీరాముడు అందరివాడు ,ఆదర్శమూర్తి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మన తాత ముత్తాతల కాలం నుండి శ్రీరాముడికి కళ్యాణం చేస్తున్నామని శ్రీరాముని కొలుస్తున్నామన్నారు.
త్రేతాయుగం  నుండి కోలుస్తున్న శ్రీరాముడికి మొన్న స్థాపించిన బీజేపీ వారికి ఏం సంబంధం అని ప్రశ్నించారు.బిజేపి వారు రాముడి అక్షింతలతో, రాముడి పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతానని అన్నారని, అది సాధ్యం కాదని హరీష్ రావు అనే మాటలు చూస్తే వారు రైతులకు రుణమాఫీ కాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. హరీష్ రావు రైతు రుణమాఫీ పై సవాల్ చేస్తూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్, బిజెపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. గత పాలకులు మన ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని వేములవాడ వెనక బాటుతనానికి  కారణమయ్యారని ఆరోపించారు.
ఎన్నికల రాగానే నాన్ లోకల్ నాయకులు మార్నింగ్ వాక్ ల పేరిట వస్తున్నారని మన ప్రాంత ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి మంత్రులంతా సమన్వయంతో అప్పులకుప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు చెల్లిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, 10 లక్షల ఆరోగ్యశ్రీని పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని,500 కె సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
పేద ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోస్తామని వారు అనే మాటలు చూస్తే చాలా విడ్డూరంగా ఉందన్నారు.ప్రజలు తమకు బుద్ధి చెప్పిన కానీ గోతికాడి నక్కల చూస్తున్నారని అయినా ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టడం మీ వల్ల కాదని మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.గత ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యే ల్లో కెసిఆర్ అసెంబ్లీకి రావడం లేదని మనోధైర్యం కోల్పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరుతుంటే ఇంకా మేము అధికారంలోకి వస్తామని మేకపోతు గాంబిర్యం ప్రదర్శిస్తున్నారన్నారు.
అధికారం పోయాక కెసిఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టారని గత 10 సంవత్సరాలు ప్రగతి భవన్ ఫామ్హౌస్ కి పరిమితమై నేడు అధికారం పోగానే ప్రజలు గుర్తు వస్తున్నారాని వారి తీరు చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లుందన్నారు. మీ పార్టీలో నుండి తెలంగాణ పదాన్ని తీసేసినప్పుడే తెలంగాణ ప్రజల పేగు బంధం నుండి మీరు దూరమయ్యారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. గతంలో ఏ విధంగానైతే మీ మధ్యలో ఉన్నాను ప్రస్తుతం కూడా అలాగే ఉన్నానని ఇక్కడి ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కరించుకుందాం అన్నారు. అర్బన్ మండల పరిధిలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మొత్తంలో వచ్చేలా కృషి చేయాలి అని కోరారు.కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి కనకయ్య,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల మల్లేశం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఇటిక్యాల లింగయ్య,  మండల బీసీ సెల్ అధ్యక్షుడు బోనాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్నాల గణేష్,వైస్ ఎంపీపీ వనపర్తి దేవరాజు,ఎంపీటీసీ లు బాస రాజశేఖర్ గాలిపల్లి సువర్ణస్వామి, వనపట్ల  ప్రభాకర్ ,ఎర్రం సత్తయ్య, ఎర్రం ఆగయ్య,కుర్మ రవి, మారం రాములు,మధు పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,  గ్రామస్తులతో పాటు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love