బీఆర్‌ఎస్‌తోనే పాలేరుకు మోక్షం

– మీలో ఒక్కడైన కందాల ఉండటం మీ అదృష్టం
– నరంలేని నాలుక మారొచ్చు.. సత్యం మారుదుగా..!
– బీఆర్‌ఎస్‌ రాకముందు పాలేరును కర్మానికి వదిలేశారు..
– ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
– మీ పాలేరు బిడ్డను..మీలో ఒక్కడినైన నన్ను గెలిపించండి: కందాల
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కూసుమంచి
”భక్త రామదాసు ప్రాజెక్టుతోనే పాలేరుకు మోక్షం…ఎవరివల్ల ఇది వచ్చిందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ రాకముందు కర్మానికి వదిలేశారు. ఒకప్పుడు ఎండిపోయిన చెక్‌డ్యాంలు, చెరువులు ఇప్పుడు నిండి కనబడుతున్నాయి. ఇప్పుడు 45 ఏళ్ల కరువు కాటకాలు తొలగాయి. నరం లేని నాలుక కాబట్టి మాట మార్చవచ్చు..సత్యం మారదు కదా..? ” అని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు.” బీఆర్‌ఎస్‌ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఇంటి మనిషులతో మాట్లాడినట్లు మాట్లాడే ఉపేందర్‌రెడ్డి లాంటి మనసున్న నాయకుడు ఉండటం మీ అదృష్టమన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టుతోనే పాలేరుకు మోక్షం లభించిందన్నారు. నరంలేని నాలుక మారుతుంది కానీ సత్యం మారదు కదా..? అన్నారు. భక్త రామదాసు నిర్మాణంతో ఎకరం భూమి విలువ రూ.30, 40 లక్షలకు చేరిందన్నారు. ఎవరి వైఖరీ ఏంటో తెలుసుకుని ఓటేయ్యాలన్నారు. పదవుల కోసం పార్టీ మారుతున్నారని, మాటలు మార్చేటోళ్లకు ఓట్లేస్తే ప్రజలు ఓడుతారన్నారు. నీటి తీరువా, లోన్‌ కట్టలేదని తలుపులు గుంజుకుపోయే పరిస్థితి నుంచి రైతుబంధు స్కీంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందన్నారు. రైతుల బాధలు తెలుసుకాబట్టి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. కావాల్సినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టుపెట్టి జైలుకు పంపుతున్నామన్నారు. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇస్తుంటే…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలు చాలంటున్నారు… మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం అన్నారు. బీఆర్‌ఎస్‌ వస్తే రైతుబంధు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంచుతామన్నారు. సిలిండర్‌ రూ.400కే ఇస్తామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గానికి ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ కళాశాలలు మంజూరు చేశామన్నారు.
మీలో ఒక్కడినైన నన్ను గెలిపించండి: కందాల
” మీ పాలేరు బిడ్డను… ఒక్కో ఊరుకు పదిసార్లు వచ్చివుంటా… మీలో ఒక్కడినైన నన్ను గెలిపించండి..” అని బీఆర్‌ఎస్‌ పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి కోరారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించానన్నారు. పాలేరే నా ప్రపంచం…పాలేరు ప్రజలే నా గమ్యం అని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు వచ్చి మాయ మాటలు చెబుతున్నారు..వారి మాయలో పడొద్దన్నారు. తమ నాయకుడు కేసీఆర్‌ చెప్పినట్టు ఎన్నికలప్పుడే పార్టీ.. మిగతా సమయంలో రాజకీయాలు ఉండవన్నారు. ఇంటింటికి వచ్చి ఓటు అడిడే హక్కు తనకే ఉందన్నారు. నా సెల్‌ నంబర్‌ మీ అందరికీ తెలుసా..? అంటూ ప్రశ్నించారు. డబ్బు లేదని చదువు ఆపకుండా సహాయ పడతానన్నారు. నియోజకవర్గంలో రూ.120 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లు మంజూరు చేశామని, నియోజకవర్గంలో దళితులందరికీ దీనిని వర్తింపజేయాలని సీఎంను కోరారు. నియోజకవర్గంలో రెండు కొత్తమండలాలు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్‌, దేశపతి శ్రీనివాస్‌, మధుసూదనాచారి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, వైరా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌, నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎండవేడిమిలో…
సభా ప్రాంగణంలో ఎండవేడిమితో సభికులు ఇబ్బంది పడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు రావాల్సిన కేసీఆర్‌ 3 గంటలకు వచ్చారు. రెండు గంటలపాటు జనం చెట్ల నీడలో సేద తీరారు. కొందరు హైవే అండర్‌బ్రిడ్జి కింద తలదాచుకున్నారు. మీటింగ్‌ సమయానికి బయలుదేరి వెళ్లారు. కారణాలు తెలియదు గానీ సభకు ముందురోజు ఏర్పాటు చేసిన షామియానాలు ఆ తర్వాత తొలగించారు. ఎండలో ఇబ్బంది పడుతున్న జనాన్ని చూసి కేసీఆర్‌ ‘నాకు ఓ శిఖా అయితే ఉందంటూ’ ఎండలో సభికులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.

Spread the love