పార్లమెంట్‌లో సమరమే…

పార్లమెంట్‌లో సమరమే...– ప్రశ్నించటానికి ప్రతిపక్షాలు సిద్ధం
– నీట్‌, యూజీసీ-నెట్‌ నుంచి రైల్వే భద్రత వరకు
– ప్రతీ అంశాన్నీ లేవనెత్తే అవకాశం
– ప్రొటెం స్పీకర్‌ ఎంపిక పైనా ‘ఇండియా’ బ్లాక్‌ ఆందోళన
– ఆసక్తికరంగా మొదటి లోక్‌సభ సమావేశం
– ఆత్మరక్షణలో అధికార బీజేపీ సర్కారు
– రాజకీయ విశ్లేషకులు, నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ : మొదటి లోక్‌సభ సమావేశం కేంద్రంలోని అధికార బీజేపీకి సంక్లిష్టంగా మారనున్నదా? కాంగ్రెస్‌ వంటి ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇండియా బ్లాక్‌లోని పార్టీలు కాషాయ సర్కారును నిలదీయటానికి సిద్ధమయ్యాయా? అంటే అవుననే సమాధానాన్ని వినిపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 18వ లోక్‌సభ మొదటి సమావేశం ఈనెల 24 నుంచి జులై 3 వరకు జరగనున్నది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేకపోవటం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, ప్రతిపక్షం గతం కంటే బలంగా మారటంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నీట్‌-యూటీ, యూజీసీ-నెట్‌ వివాదాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న రైల్వే ప్రమాదమూ మరొకసారి రైల్వే భద్రత సమస్యపై ఆందోళనను కలిగిస్తున్నది. ఈ అంశాలు 18వ లోక్‌సభ మొదటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశమున్నదనీ, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో 18వ లోక్‌సభ మొదటి సెషన్‌ ఎన్డీఏ సర్కారకు సంక్లిష్టంగా మారనున్నదని వారు అంటున్నారు. మొత్తానికి మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడనున్నదని చెప్తున్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఎన్డీఏయేతర పక్షాల ఇష్యూ-బేస్డ్‌ కామన్‌ ఫ్రంట్‌ను సమీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నందున సోమవారం నుంచి ప్రారంభమయ్యే మొదటి సెషన్‌ ఆసక్తికరంగా మారనున్నదని చెప్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక వంటి అంశాలపై కేంద్రంతో ఏకాభిప్రాయానికి రావటానికి ఇండియా కూటమి మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ, ఎనిమిది పర్యాయాలు కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న కొడిక్కున్నిల్‌ సురేష్‌ను ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎన్నుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్ష శిబిరంలోని వర్గాలు తెలిపాయి. కటక్‌ నుంచి ఏడు సార్లు విజయం సాధించిన బీజేపీ ఎండీ భర్తృహరి మహతాబ్‌ ప్రొటెమ్‌ స్పీకర్‌గా వ్యవహరిస్తారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రకటించిన విషయం విదితమే. అయితే, దీనిని కాంగ్రెస్‌ తప్పుబడుతున్నది. ”ప్రధాన భాగం(బీజేపీ)కు లోక్‌సభలో మెజారిటీ లేదని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 2024 వరకు చేసినట్టుగా చేయగలమని వారు(బీజేపీ ప్రభుత్వం) భావిస్తే, పొరబడినట్టే. అది వారికి ప్రమాదమని వారు త్వరలోనే తెలుసుకుంటారు” అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ఎంపీ మనీశ్‌ తివారీ అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది సభలో మెజారిటీ కంటే 32 సీట్లు తక్కువ. మరోపక్క, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా 99 మంది ఎంపీలు ఉన్న విషయం విదితమే. ”కె సురేష్‌ ఎనిమిది పర్యాయాలు దళిత ఎంపీగా ఉన్నారు. ప్రోటెమ్‌ స్పీకర్‌ పదవికి అతడిని కాదని ఏడుసార్లు గెలిచిన తమ ఉన్నత తరగతి ఎంపీని ఎంచుకున్నది. ఇది దేనిని చూపిస్తుంది?” అని కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ ప్రశ్నించారు.
వివిధ మతాలు, లింగాలు, కులాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 543 మంది ఎంపీల ప్రమాణ స్వీకారానికి తమ సామాజికవర్గ సభ్యుడు అధ్యక్షత వహించే మైలురాయి అవకాశాన్ని మోడీ ప్రభుత్వం భారత్‌లోని దళిత వర్గానికి నిరాకరిస్తున్నదని కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ గొగోరు ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఆరోపించారు. ”పార్లమెంటులో మోడీ గత పదేండ్లుగా వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా వ్యవహరిస్తారని నేను ఆశించటం లేదు. ఆయన పార్లమెంటుకు గైర్హాజరవుతారు. మొదటి రోజు పార్లమెంట్‌ హౌస్‌ వెలుపల మీడియాతో మాట్లాడతారు. ప్రశ్నలకు దూరంగా ఉంటారు. ఆయన హౌస్‌ లోపల ఇండియా కూటమి నుంచి ఎటువంటి ప్రశ్నలనూ తీసుకోరు. తన ఇమేజ్‌ను కాపాడుకోవటానికి తన జూనియర్‌ మంత్రులకు వదిలివేస్తాడు. నీట్‌-యూజీ, అగ్నివీర్‌ లేదా దేనిపైనా ఎటువంటి ప్రకటనా ఉండదు”అని గొగోరు ఒక ఆంగ్ల వార్త మాధ్యమంతో అన్నారు. కాగా, కొన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష నేతలు శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ), వైసీపీ వంటి ఎన్డీఏయేతర పార్టీలు కూడా తమతో టచ్‌లో ఉన్నాయని ఇండియా కూటమి చెప్తున్నది.
సెషన్‌లో మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం బుధవారం జరగనున్నది. స్పీకర్‌ ఎంపిక గురువారం జరగనున్నది. దీని తరువాత జులై 3 వరకు ప్రభుత్వ వ్యవహారాలు జరుగుతాయి. ఈ సమయంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చ హౌరాహౌరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, దేశంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు తమ ప్రభుత్వానికి మచ్చను తీసు కొచ్చాయనీ, సభలో ఇవి తమను డిఫెన్స్‌లోకి నెట్టేస్తాయని బీజేపీ నాయకులే చెప్తుండటం గమనార్హం. యూజీసీ-నెట్‌ పరీ క్షను రద్దు చేయటం, నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌పై బీహార్‌, గుజరాత్‌లలో పోలీసుల విచారణ ప్రభుత్వానికి సంక్లిష్ట పరిస్థితులును తీసు కొచ్చాయని మరొక బీజేపీ సీనియర్‌ నాయకుడు అన్నాడు. బీజేపీ, ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలలో కూడా ఈ అంశం ఆందో ళన కలిగిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Spread the love