సంసారి సల్ల గురిగి ఎత్తేస్తె కల్లు గురిగి

Samsari Salla Gurigi Atteshte Kallu Gurigiకొందరి మనుషుల అంతరంగం గుర్తుపట్టడం కష్టం. మీది మాటలు ఒకతీరు వుంటయి. లోపల ఇంకో తీరు కప్పిస్తయి. ‘మీద మెరుగులు లోపల పురుగులు’ లెక్కనే వుంటరు. వీల్ల రంగు బయట పడాలంటే ఏదైన గురిగి పట్టుకొని పోతే జారిపోతె తెలుస్తది. గురిగి అంటే మట్టితో చేసిన పాత్ర. గత కాలంలో ఈ పాత్రలోనే మజ్జిగ, కల్లు తీసికపోయేవారు. కల్లు తాగడు అని ప్రచారంలో వున్న పెద్ద మనిషి చేతిల గురిగి పలిగిపోతే బజార్ల తెల్సిపోయిందట. అప్పుడే పుట్టింది ‘సంసారి సల్ల గురిగి ఎత్తేస్తే కల్లు గురిగి’ అని. పగిలి పోయినంక కింద పడంగనే కల్లు వాసన వచ్చే వరకు ఆ సంసారి సంగతి బయటపడ్డది. ఇటువంటి వాల్లు అందరికి నీతులు చెప్పుతరు. అందుకే వీల్లను ఉద్దేశించే ‘చెప్పేటివి శ్రీరంగ నీతులు దూరేటివి వేరొక గుడిసెలు’ సామెత ఉద్భవించింది. మాటలు ఒకటి చేతలు ఒకటి అయితే గిట్లనే వుంటది. అయితే కొందరు కుల రీత్యా శాఖాహారులుగానే వుంటరు. మరికొందరు మాంసాహారులుగా జీవితం కొనసాగిస్తరు. పుట్టుక రీత్యా ఎట్లా వున్నా ఎవరి ఆహారపు అలవాట్లు వాల్లవే. బ్రాహ్మణ వైశ్యలు సంపూర్ణ శాఖాహారులుగానే వుంటరు. ఊర్లల్ల వీల్ల వాడలు వేరుగానే వుంటయి. ఇప్పుడంటే చికెన్‌ సెంటర్లు వచ్చినయి గానీ గతంలో ఇతరులు ఇండ్లల్లోనే కోళ్లను పెంచుకునేది. కోసుకుని వండుకుని తినేవాల్లు. కోళ్లు మాయం అయినప్పుడు ‘అందరు కోమట్లు బాపండ్లే మరి కోళ్లు ఎట్ల మాయమయినయి’ అనే సామెత గమ్మత్తుకోసం వాడేవాల్లు. ఆ కాలంలో కోళ్లను దొంగతనంగ తీసుకపోయి తినేవాల్లు. తర్వాత గుర్తుపట్టవచ్చు. వాల్ల పెంటలల్ల, పెండ్లల్ల కోడి బూరు చూసి గుర్తుపట్టవచ్చు. అట్లనే కొందరు ఒక పనికి వచ్చి అసలు ముచ్చట చెప్పనే చెప్పరు. వాల్లను ‘సల్లకు వచ్చి ముంత దాసినట్లు’ అని అంటరు. సల్ల అంటే మజ్జిగ. మజ్జిగను ఉచితంగనే తీసికపోతరు. రాంగనే సల్లపోయండి అని అనకుండ ముంత కొంగు కింద దాచుకుని వుంటరు. అట్లనే కొందరు పైన చెప్పిన రకాలే ‘తాటి చెట్టు కింద కూచోని పాలు తాగుతున్న’ అనేవాల్లు. పాలు తాగేందుకు ఇంట్లనే వుండి తాగుతరు కాని తాళ్లల్లకు ఎందుకు వెళ్లుతరు. ఎందుకంటే ‘సురాపానం’ సేవించేందుకే అని అర్థం. కాని తాగకూడని వాల్లు ఇలా సాటుకు మాటుకు తాగుతరు అన్నట్టు. ప్రతి సందర్భంలో జానపదులు ఆ తాత్వికతను బట్టి సామెతను సృష్టించుకున్నరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love