‘తెలంగాణ సాహిత్యం దేవులాట’

తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన ఎన్నో మంచి పుస్తకాల్లో ఇదొకటని నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఒక పుస్తకం చదివితే ఒక రచయిత కనబడతాడు. ఇలాంటి సెమినార్‌ పత్రాలను చదవడం వల్ల ఒక్కో రంగాన్ని ఆసాంతం ఆకళింపు చేసుకోవడమే గాక పరిశోధకుల నిరంతర పరిశోధనా కృషి ఫలితాన్ని తెలుసుకోగలం.
16 అంశాలపై నిష్ణాతులైన పరిశోధకులు తమ శక్తియుక్తులతో వివిధ అంశాలపై లోతైన అవగాహనతో వెలువరించిన పత్రాలు మొత్తం తెలంగాణ అస్థిత్వాన్ని తెలుపుతాయి. ‘తెలంగాణ చరిత్ర వాస్తవాలు – వక్రీకరణలు’ శీర్షిక కింద ప్రముఖ కవి, వక్త వేణు సంకోజు తరాలుగా తెలంగాణ ఎందుకు, ఎలా వెనకబడిందో వివరంగా చెప్తూ, శాతవాహనుల చరిత్రకు పూర్వమే తెలంగాణాలో ఆశ్మక, మూషీక వంటి గణరాజ్యాలతో కూడిన జనపదాలున్నాయని వివరిస్తాడు.
బహుభాషాకోవిదుడు, తెలంగాణ భాష పుట్టుపూర్వోత్తరాలను విడమరిచి చెప్పగల ధీశాలి నలిమెల భాస్కర్‌ ‘అర్థవంతమైన తెలంగాణ భాష’ శీర్షికలో తెలంగాణపదం ఎలా పుట్టిందో విడమరిచి చెప్తాడు.
కూడును కుడిచే (తినే) చెయ్యిని ‘కుడిచెయ్యి’ అంటారని దానికి కొంత ఎడంగా, దూరంగా ఉన్న చెయ్యి కనుక ‘ఎడమ చెయ్యి’ అయ్యిందట. అట్లాగే ‘అల్లుడు’ (అల్లువాడు) తన పెళ్లయ్యాక తల్లిదండ్రుల కుటుంబాన్నీ, తన భార్య తరఫు కుటుంబాన్నీ అల్లుతాడనీ, ఆ బంధాన్ని పెనవేసుకునేలా చేస్తాడట. ఇలా ఎన్నో పదాలను విప్పి చెప్తుంటే తెలుగులోని ఆ ‘లోగుట్టు’ తప్పక తెలుసుకోవాలనే తపన మరింత పెరుగుతుంది. తెలంగాణ సంస్కృతి విశిష్టమైందని, ప్రత్యేక అస్థిత్వం గలదని నందిని సిధారెడ్డి తన ‘తెలంగాణ సంస్కృతి’లో చెప్తూ కాలగమనంలో ఆంధ్ర సంస్కృతిలో భాగంగా పేర్కొన్నా నేడు అది పునరుజ్జీవనం పొందుతున్నదంటాడు.
ఆచార్య జి.ఎస్‌ మోహన్‌ ‘తెలంగాణ జానపద సాహిత్యం’ శీర్షికలో తెలంగాణ పల్లెల్లోని పలు జానపదుల నోటినుండి జాలువారిన స్వచ్ఛమైన జానపద పాటలు, గీతాలను చక్కగా ఉదాహరించారు. ఇంకా ‘తరగని జానపద సాహిత్య సంపదకు కాణాచి తెలంగాణ అని, బండ్లకెత్తించగలిగిన జానపద సాహిత్య భాండారం తెలంగాణలో నిక్షిప్తమైవుంద’ని తెలియజేస్తుంది ఇందులోని వ్యాసం.
‘తెలంగాణ స్త్రీల పాటలు’ శీర్షికలో డా.ఆర్‌. కమల తెలంగాణ స్త్రీలు వారి పరిసరాలకనుకూలంగా, వారి మనసులోని భావాలకు ఆశుధారను రంగరించి పాడుతూ ఆడారని, ఆ పాటలే ఆనోట ఈనోట వ్యాపించాయని సోదాహరణంగా వివరించారు.
‘తెలంగాణ సాహిత్యం దేవులాట’ ముందుమాటలో కన్వీనర్‌ డా||తూర్పుమల్లారెడ్డి ఇప్పటి తెలంగాణ సాహిత్యానిది కేవలం సాహిత్యోద్యమం కాదని, అనేక తిరస్కారాల నుండి, ధిక్కారాల నుండి, విస్మరణల నుండి, వివక్షతల నుండి పుట్టి ఎలుగెత్తిన జీవనగీతం అంటున్నాడు. ఎంతో విలువైన ఈ సెమినార్‌ పత్రాల పుస్తకం మనమూ చదువుదాం.
– ఎనిశెట్టి శంకర్‌
9866630739

Spread the love