మహిళా సాధికారతకు గుర్తు : సంఘమిత్ర

26 డిసెంబరు 2023న థేరవాద బౌద్ధులంతా సంఘ మిట్ట-డే జరుపుకుంటున్నారు. సంఘమిట్ట-అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సంఘమిత్ర – అంటే చక్రవర్తి అశోకుడి కూతురిగా గుర్తుపట్టే అవకాశం ఉంది. అప్పటి పాలి భాషలో ఆమె పేరు సంఘమిట్ట మహాథేరి. ఆమె సోదరుడు మహింద మహాథేరా. ఈ థేరా-థేరి అనేవి వారు థేరవాద బౌద్ధంలో విషయాల్ని క్షుణ్ణంగా అభ్య సించి అత్యున్నత స్థాయికి అంటే ఇతరులకు బౌద్ధ దీక్ష ఇవ్వగల గురుస్థానానికి చేరారని అర్థం! మగ వారైతే థేరా అని, మహిళలైతే థేరి అని అంటారు. అందులో ఈ అన్నా చెల్లెళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి చేరి, మహాథేరా-మహాథేరి అయ్యారు. త్ర-ద్ర పదాలు పాలి భాషలో ఉండవు. సంస్కృతీకరిం చబడిన భాషల్లో అవి చేరాయి. అందుకే మనం వారిని సంఘమిత్ర అని మహేంద్ర అని పిలుచుకుంటున్నాం. ఈ సంఘమిత్ర కోసం ఒక రోజు – ‘ఉండువప్పోయ’ను బౌద్ధులు ఎందుకు కేటాయించుకున్నారూ? అంటే, బౌద్ధం వ్యాపింప చేయడంలో ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తుగా సంవ త్సరంలో చివరి పౌర్ణమి (ఉండువప్‌)ను ఆమె స్మృతిలో జరుపు కుంటున్నారు. చారిత్రక దృష్టి కోణంలో చూసినా, సాధారణ శకానికి ముందే అశోకుడు మహిళా సాధికారతకు ఎంత అవకాశమిచ్చాడో కూడా దీని ద్వారా మనం గ్రహించొచ్చు.
తమ తమ మతాలు స్త్రీలకు సమాన హక్కులూ స్థాయీ ఇస్తున్నాయని నేటి ఆధునిక కాలంలో మత ప్రభోధకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, నిజానికి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బౌద్ధంలో స్త్రీలకు ఆనాడే సమాన స్థాయి కల్పించడం జరిగింది. బుద్ధుడు స్త్రీల పట్ల దయామయుడై వ్యవహరించేవాడు. వారి సామర్థ్యాన్ని గ్రహించి, ముఖ్యమైన బాధ్యతలు అప్పగిచేవాడు. ఇది గ్రహించిన అశోకుడు ఈ విష యంలో బుద్ధుణ్ణి అనుసరించాడు. సాధారణ శకానికి ముందే మహిళలకు విద్యనందించాడు. బౌద్ధ ప్రచారానికి సంబం ధించి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. ఆధునిక సమా జంలో నేడు అందుబాటులో ఉన్న ప్రయాణ సౌకర్యాలు ఏవీ లేని ఆ కాలంలో స్వయంగా తన కూతురిని శ్రీలంకకు పం పాడు. అది కూడా ఆనాటి శ్రీలంక రాజు అభ్యర్థన మేరకు ఒక అధికార ప్రతినిధిగా పంపాడు. ఆ రకంగా సంఘమిత్ర విదే శానికి వెళ్ళిన తొలి మహిళా రాయబారి అయ్యింది. అంతకు ముందే కొడుకు మహేంద్రను అశోకుడు శ్రీలంకకు పంపాడు. అతను అక్కడి పరిస్థితి గమనించి అక్కడ ధమ్మదీక్ష తీసుకో వడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అసంఖ్యాకంగా ఉన్న మహిళల్ని చూసి – బౌద్ధ భిక్షుణిగా పూర్తి అర్హత సంపా దించిన తన చెల్లెలు సంఘమిత్రను పంపమని మహేంద్ర తండ్రికి ఉత్తరం పంపించాడు. అంతకు ముందే శ్రీలంక రాజు దేవానాం పియ తిస్స (250-210 దీజజు) ఒక లేఖ ద్వారా సంఘమిత్రను పంపించవల్సిందిగా అశోకుడిని అభ్యర్థించాడు, అశోకుడి పరిపాలన కాలంలో లింగవివక్ష లేదని, బానిస విధానం లేదని మెగ స్తనీస్‌ రాసిన విషయం కూడా మనం ఇక్కడ గుర్తుసెట్టుకోవాలి.
శ్రీలంక నుండి వచ్చిన అభ్యర్థనలు అందుకుని అశోకుడు ఆలోచనలో పడ్డాడు. ఆడపిల్లను విదేశాలకు పంపడమా? పైగా ఒక సారి పంపిస్తే ఇక అంతే! ఆమె మళ్ళీ భారత్‌కు తిరిగి వస్తుం దని గానీ, మళ్ళీ కనబడుతుందని గానీ నమ్మకం లేదు. ఆమె తన ‘మిషన్‌’లో పూర్తిగా మునిగిపోయి మళ్ళీ తిరిగి రాకపో వచ్చు. ఆ రకంగా తన పిల్లలిద్దరినీ మళ్ళీ చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అప్పటికే సంఘమిత్ర కొడుకు సుమనను మరి కొంతమంది కుటుంబ సభ్యులను తీసు కుని మహేంద్ర శ్రీలంక వెళ్ళి పోయాడు. పిల్లల్ని మళ్ళీ చూడలేనని తెలిసి కూడా, ఆ తండ్రి మనసు తల్లడిల్లు తున్నా గుండె దిటవు చేసుకుని, బౌద్ధ ప్రచారానికి వారిని శ్రీలంక పంపడం చాలా గొప్ప విషయం! ఎంతో పట్టు దల, ఎంతో కార్యదీక్షా ఉంటే గానీ, ఆ పని చేయలేరు. తను చేసిన కళింగ యుద్ద్ధంలో ఎంతోమంది వారి కుటుం బసభ్యులకు కాకుండా పోయారు కదా? ఆ లోటును ఎలా పూడుస్తాం? పూడ్చలేమని అశోకుడికి తెలుసు కన్న బిడ్డలిద్దర్నీ బౌద్ధ ప్రచారానికి పంపడమంటే, ఒక రకంగా సమాజసేవకు కదా?-అన్న ఆలోచన రాగానే, అశోకుడు అంతటి కఠినమైన నిర్ణయానికి రాగలిగాడు.
అశోకుడి పెద్ద భార్య దేవి బుద్ధుడి ఆరాధకురాలు. అందువల్ల ఆమె పెంపకంలో పెరిగిన మహేంద్ర, సంఘ మిత్రలు బాల్యం నుండే బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు. క్రమంగా అందులో అర్హత సంపాదించి థేరా-థేరి స్థాయి ని అందుకున్నారు. కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తా పంతో సతమతమై అశోకుడు బౌద్ధం స్వీకరించడం వెనుక పెద్ద భార్య దేవి ప్రభావం బాగా ఉందని చెపు తారు. అయితే, అది నిజం కూడా కావొచ్చు. సంఘ మిత్ర, మహేంద్రలు చక్రవర్తి సంతానం అయినప్పటికీ, భోగలాలసకు అలవాటు పడకుండా, ప్రజలకు ఒక మంచి నైతికపరమైన, హేతుబద్ధమైన జీవన విధానాన్ని బోధించడానికి నడుం బిగించారు. మొదట మహేంద్ర దక్షిణ భారత దేశానికి చేరుకుని, అక్కడ కొంతకాలం బౌద్ధ ప్రచారం చేసి శ్రీలంకకు వెళ్ళాడు. అక్కడ అతని బోధనలకు ప్రభావితులై అధిక సంఖ్యలో పౌరులు బౌద్ధం స్వీకరించడం ప్రారంభించారు. అయితే దేశాన్ని మొత్తం బౌద్ధ దేశంగా మార్చాలంటే సమాంతరంగా బౌద్ధ భిక్షుణి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మహేంద్ర గుర్తించాడు. సంఘమిత్ర కోసం కబురు పెట్టాడు.
మహేంద్ర కోరిక మేరకు సంఘమిత్ర బుద్ధగయలోని బోధివృక్షం దగ్గరి నుంచి ఒక చిన్న బోధి మొలక బంగారు తొట్టిలో పెట్టుకుని శ్రీలంకకు తీసుకుపోయింది. దాన్ని అక్కడ అనురాధపురం మహామేన తోటలో నాటారు. ఆ మొక్క మహా వృక్షమై ఇప్పటికీ అక్కడ వైజ్ఞానికుల పర్యవేక్షణలో సురక్షితం గా ఉంది. ఆ తర్వాత శ్రీలంకలో భిక్షుణిల ఆరామాలను సంఘమిత్ర పేరు, పర్యాయపదమైపోయింది. థేరవాద బౌద్ధా న్ని బర్మా, చైనా, థారులాండ్‌, తైవాన్‌, కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లలో వ్యాపింపజేయడానికి ఆ వృక్ష శాఖల్ని కొందరు భిక్షుణిలు అయా దేశాలకు తీసుకు పోయారు. అంటే సంఘ మిత్ర ఆనాడు తీసుకుపోయిన మొక్క అలా ఎన్నో దేశాలకు చేరిందన్నమాట! సంఘమిత్ర తన పరివారంతో శ్రీలంక చేరిన రోజు సంవత్సరంలో చివరి పూర్ణిమ అందువల్ల, ఆ రోజు ప్రాముఖ్యతను, సంతరించుకుంది. అన్ని దేశాల బౌద్ధ సంఘా లు ఆమె స్మృతిలో ‘సంఘమిత్ర-డే’ గా జరుపుకుంటున్నాయి. దానిని వారు ‘ఉపోసతపోయ’-గా ‘ఉడువపపోయ’-గా జరుపుకుంటున్నారు.
అశోకుడు తన కూతురు సంఘమిత్ర (ఆయాపాలి)కి తోడుగా ధమ్మపాలి, ఆయుపాలి, ఖేేమ, ఉపలవన్న, ధమ్మా దిన్న వంటి భిక్షుణిలను కూడా పంపాడు. అంతే కాదు, భారత దేశం నుండి వైద్యులను, కళాకారులను, కలప, ఇనుముతో పని చేయగల సాంకేతిక నిపుణులను, నిర్మాణ పనులలో నిష్టాతులను ఎన్నిక చేసి పంపాడు. భారతదేశంలో 84 వేల బౌద్ధ స్థూపాలు నిర్మంపజేసిన చక్రవర్తి గనక, ఆ అవసరాన్ని గుర్తించి అన్ని రకాల వారిని సంఘమిత్ర బృందంతో పంపాడు. కేవలం బౌద్ధవ్యాప్తికే కాకుండా శ్రీలంక సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి పాటుపడే వారంతా ఆ బృందంలో ఉండడం విశేషం! వారి నౌక శ్రీలంక జాఫ్నాలోని దంబకోల పటున (పట్టణం)కు చేరేసరికి అప్పటి రాజు తిస్స-స్వయంగా ఎదురు వచ్చి స్వాగతం పలికాడు. సంఘమిత్ర కోసం అనురాధాపురంలో పెద్ద బౌద్ధారామం కట్టించాడు. దాని పేరు ‘హత్తలోక ఉపాసికారమయ’ జీవితాంతం అక్కడే ఉండి, భిక్షుణిల వ్యవస్థను పతిష్టం చేసి, శ్రీలంకను బౌద్ధద్వీపంగా తీర్చిదిద్దిన ఘనత సంఘమిత్రదే!
సంఘమిట్టకు మరో పేరు ఆయాపాలి. ఆమె తొలి యవ్వన దశలో అఘ్రిబ్రహ్మ ను వివాహం చేసుకుంది. వారికి ఒక కొడుకు పేరు సుమన. భర్త, కొడుకు కూడా బౌద్ధం స్వీక రించిన వారే. కొంచెం ముందూ వెనకలుగా వారు శ్రీలంకకు చేరుకున్నారు. విరామం లేకుండా శ్రమించి శ్రీలంకను బౌద్ధ ద్వీపంగా మలిచిన సంఘమిత్ర, తన 79వ యేట అక్కడ తన ఆరామంలో ప్రశాంతంగా కన్నుమూసింది. అప్పటి రాజు ఉత్తియ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వయంగా ఆమె అంత్య క్రియలు జరిపాడు. ఆమె భారతదేశం నుండి తీసుకు పోయిన భోధివృక్షం దగ్గరలోనే ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. అక్కడే జరగాలని ఆమె బతికి ఉండగానే రాజు ఉత్తియకు చెప్పిందట! ఆయన ఆమె కోర్కెను గౌర విం చాడు. ఆమె పేరుతో ఇప్పుడు అక్కడ ఒక స్థూపం ఉంది.
శ్రీలంక బౌద్ధ దేశంగా మారడానికి మరికొంత నేప థ్యం ఉంది. శ్రీలంకలోని బౌద్ధ చారిత్రక గ్రంథాల ఆధా రంగా తెలిసేదేమంటే గౌతమ బుద్ధుడు శ్రీలంకను మూడుసార్లు దర్శించాడు. అక్కడ ఆయన దర్శించిన 16 స్థలాల్ని అక్కడి బౌద్ధులు పవిత్ర స్థలాలుగా భావిస్తారు. వాటిని ‘సోలస్‌మస్తన’ అని వ్యవహరిస్తారు. దీనికి సం బంధించిన వివరాలన్నీ ‘మహావంశ’లో వర్ణించబడ్డాయి. బుద్ధుడికి జ్ఞానోదయమైన తర్వాత 9 నెలలకు మొదటి సారి శ్రీలంకకు వెళ్ళాడని, రెండోసారి ఐదేళ్ళ తర్వాత వెళ్ళాడని, చివరగా మూడోసారి జ్ఞానోదయం తర్వాత 8 ఏళ్ళకు వెళ్ళాడని ఆధారాలు చెపుతున్నాయి. మొదటిసారి ‘మహియన్గామ’కు వెళ్ళి అక్కడి యక్ష జాతి వారిని ఒప్పించి, గిరి అనే ద్వీపానికి పంపించాడని, రెండవ సారి ‘నాగదీప’లో అడుగుపెట్టి చులోదర-మహాదర అనే నాగ జాతి రాజుల మధ్య సింహాసనానికి (జీవషవశ్రీవస షష్ట్రaఱతీ) సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాడనీ తెలుస్తూ ఉంది. ఇక మూడో సారి నాగవంశపు రాజు, మనియక్కిక ఆహ్వానంపై 500 మంది బౌద్ధ భిక్షులతో సహా శ్రీలంక లోని ‘కెలనీయ’కు చేరాడని, అక్కడ ధమ్మం బోధించాడని ఆధారాలున్నాయి. బుద్ధుడు కాలు మోపిన పర్వతం ‘శ్రీపాద’ గా ప్రాచుర్యం పొంది, బౌద్ధులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలమైంది. అంతేకాదు సమంతకుట, దివగుహవ, జయశ్రీ మహాబోధి, రువన్‌ విలిసాయ, తుపరమయ, సిలా సిటియ, ముతియన్గన్‌ వంటి స్థలాలు బుద్ధుడు దర్శించాడని చెపు తారు. ఇవన్నీ ఆ కాలం నాటి స్థలాల పేర్లు. ఇప్పుడు ఆ పేర్లు కూడా మారిపోయి ఉంటాయి. దేశం పేరే మారుతూ వస్తోంది. ఒకప్పటి సిలోన్‌ లంక అయ్యింది. లంక శ్రీలంక అయ్యింది! మార్పు సహజం!
– కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవ శాస్త్రవేత్త.
(మెల్బోర్న్‌ నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love