Sunday, May 31, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్లో సాత్విక్‌ జోడీ

ఫైనల్లో సాత్విక్‌ జోడీ

- Advertisement -

వరల్డ్‌ నం.1 జోడీపై సెమీస్‌లో గెలుపు
సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750

సింగపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ ఈ ఏడాది వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో రెండోసారి ఫైనల్‌కు చేరుకున్నారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌,చిరాగ్‌లు శనివారం సింగపూర్‌లో జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1 దక్షిణ కొరియా షట్లర్లు కిమ్‌, సియోలపై వరుస గేముల్లో గెలుపొంది సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 52 నిమిషాల్లోనే ముగిసిన సెమీఫైనల్‌ సమరంలో సాత్విక్‌,చిరాగ్‌లు 21-19, 21-18తో మెప్పించారు. వరల్డ్‌ నం.1 దక్షిణ కొరియా జోడీతో మూడు సార్లు తలపడిన సాత్విక్‌, చిరాగ్‌లు తొలిసారి విజయం సాధించారు. సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌ టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. సెమీఫైనల్‌ సమరంలో రెండు గేముల్లోనే సాత్విక్‌, చిరాగ్‌లు లాంఛనం ముగించినా.. రెండు గేముల్లోనూ వరల్డ్‌ నం.4 భారత జోడీ ఆరంభంలో వెనుకంజ వేసింది. తొలి గేమ్‌లో 8-13, 13-17తో సాత్విక్‌, చిరాగ్‌లు వెనకబడ్డారు. కానీ ఆఖర్లో పుంజుకుని తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో 11-14తో వెనుకంజ వేసినా.. వరుసగా ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుని ఆధిక్యంలోకి వచ్చారు. అదే ఊపులో రెండో గేమ్‌ను, ఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. ‘దక్షిణ కొరియా షట్లర్లు ఉత్తమ డిఫెన్స్‌ ఆడుతున్నారు. ఎటాకింగ్‌ గేమ్‌ ఆడినప్పుడు సంయనం అవసరమని భావించాం. ఆరంభంలో వెనుకబడినా..మా ప్రణాళికకు కట్టుబడి ఉంటే అవకాశం వస్తుందని అనుకున్నామని’ సాత్విక్‌ తెలిపాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్ట్రో జోడీకి పరాజయం ఎదురైంది. జపాన్‌ షట్లర్లు యుచి, సయాకల చేతిలో 16-21, 21-17, 13-21తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడారు. నేడు జరిగే మెన్స్‌ డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ మలేషియా షట్లర్లు మథియస్‌, అలెగ్జాండ్ర బోయెలతో సాత్విక్‌, చిరాగ్‌లు పోటీపడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -