నిరసన సెగలు

నిరసన సెగలుపరమపద సోపాన పటంలో అందలమెక్కడానికి కుమ్మరించిన హామీలు ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అంటూ తప్పించుకోచూస్తే కార్మికులు పార్టీలను వదుల్తారా? నేడు రాష్ట్రంలో రాజుకుంటున్న దావానాలమదే! స్టెతస్కోప్‌ పట్టాల్సిన చేతులు ప్లకార్డులు పట్టాయి. రెవెన్యూలో సేవలందించాల్సిన వారు నడి వీధుల్లోకి వచ్చారు. గర్భిణీలకు చేయూతనివ్వాల్సిన చేతుల పిడికిళ్లు బిగిస్తున్నాయి. కొంత కాలంగా రాష్ట్రంలోని వివిధ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం చూస్తూనే ఉన్నాం. జూనియర్‌ డాక్టర్లు పలు డిమాండ్లతో నిరవధిక సమ్మెకు దిగారు. వీరే కాక రాష్ట్రంలోని ఆశావర్కర్లు, వీఆర్వోలు సైతం తమ సమస్యలు పరిష్కరించమంటూ నెలలుగా సర్కారుకు వినతులు ఇస్తూనే ఉన్నారు.
వాస్తవానికి వీరి సమస్యలు ఈనాటివి కావు. బీఆర్‌ఎస్‌ హయాం నుండి పలు సమస్యలతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనతో విసుగెత్తి కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వరకు సమస్యలు వింటున్నారు. వినడం కేవలం ఉపశమనం మాత్రమే. దీంతో కడుపు నిండదు కదా! అందుకే కాంగ్రెస్‌ సర్కారు కొలువు తీరిన తర్వాత తమ సమస్యలు పరిష్కరించమంటూ ఆశావర్కర్లు, వీఆర్వోలు, జూనియర్‌ డాక్టర్లు దఫదఫాలుగా అధికారులు, మంత్రులు, సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పరిష్కరిస్తాం అంటున్నారే తప్ప అచరణలో ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు.
నిర్దేశిత సమయంలో ఉపకారవేతనాల విడుదల, పెండింగ్‌ స్టైపెండ్‌, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్లకు గతంలో ఒప్పుకున్న స్టైపెండ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 15శాతం రిజర్వేషన్‌ వంటివి వీరి కీలకమైన డిమాండ్లు. ఏండ్ల నుండి పేరుకుపోయిన ఈ సమస్యలతో జూనియర్‌ డాక్టర్లలో అసంతృప్తి పెరిగిపోయింది. గత్యంతరం లేక సమ్మెకు దిగారు. ఈ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ‘జూడా’ల నేతలతో చర్చలు సైతం జరిపారు. అవి ఫలించక పోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరి సమ్మె కేవలం వారి సొంత సమస్యలకే పరిమితం కాదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుదలకు అవసరమైన డిమాండ్లు సైతం ఇందులో ఉన్నాయి. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక పరీక్షలు చేసే సదుపాయం లేదు. చివరకు సర్జికల్‌ బ్రాంచ్‌లలో కూడా పరికరాల కొరతతో రోగులకు సరైన వైద్యం అందించలేక పోతున్నారు. ఇక ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మిస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు దానికి సబంధిం చిన వివరాలేమీ వెల్లడించక పోవడంతో ‘జూడా’లలో దీనిపై నమ్మకం పోయింది. ఇక డీఎంఈకి రూ.400 కోట్లకు పైగా విడుదల చేస్తున్నా అవి తమ అవసరాలకు, సరైన సమయానికి ఉపయోగపడడం లేదంటూ ‘జూడా’లు ఆవేదన చెందుతున్నారు.
మరోపక్క ఆశావర్కర్లు ఎప్పటి నుండో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ వేతనం రూ.18వేలకు పెంచుతామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని సర్కారుకు గుర్తు చేస్తున్నారు. శిక్షణ పొంది ఏండ్ల నుండి సేవలందిస్తున్న తమకు కొత్తగా పరీక్షలు నిర్వహించాలంటూ ఇటీవల కేంద్రం పంపిన సర్క్యులర్‌ను కాంగ్రెస్‌ సర్కారు అమలు చేస్తామనడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అలాగే వీఆర్వోల వారసులకు ఉద్యోగాలు, ఆయా శాఖల్లో పని చేస్తున్న వారికి ఆప్షన్‌ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగింపు, సొంత జిల్లాలకు బదిలీ వంటి పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతి సభలో వీఆర్వోల సమస్యలు పరిష్కారిస్తామని కాంగ్రెస్‌ నాయకులు స్పష్టమైన హమీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పదివేలకు పెంచుతామని ఇప్పటి వరకు స్పందించలేదు. వారూ మూడు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. అంగన్‌వాడీలు బయోమెట్రిక్‌లో వెనక్కు తగ్గాలంటూ వినతులు ఇస్తున్నారు. మున్సిపల్‌, గ్రామపంచాయతీ కాంట్రాక్ట్‌ కార్మికులు తమకిచ్చిన పర్మినెంట్‌ హామీని నిలబెట్టుకొమ్మంటున్నారు. ఐకేపీ, వీఓఏలు సైతం తమ సమస్యలపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్‌ చెప్పి ఓపిక పట్టమన్నారు. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ఎలాంటి కోడ్‌లు అడ్డులేవు.
కడుపు నిండనపుడు కండ్లెర్రజేయడం సహజం. అందుకే వరుసగా అందరూ ఆందోళన బాట పడుతున్నారు. సొంత గూడు విషయంలోనూ ఇదే కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు స్పందించకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవడం ఖాయం. ఈ ఉద్యమాల ప్రభావం సాధారణ ప్రజలపై పడక తప్పదు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తమవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. రేవంత్‌ సర్కారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తక్షణమే స్పందించాలి. ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.

Spread the love