స్వయం ప్రకాశకులు పిల్లలు

స్వయం ప్రకాశకులు పిల్లలు– పిల్లల కోసం ఆలోచించే చోట మానవత్వం
– బాలోత్సవం భుజాలపై పిల్లల పట్ల బాధ్యత : తెలంగాణ బాలోత్సవంలో వక్తలు
– అత్యంత వైభవంగా ముగింపు వేడుకలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌
”పిల్లల కోసం ఎక్కడ ఆలోచిస్తారో.. అక్కడ మానవత్వం వెల్లివిరుస్తుంది.. పిల్లలు స్వయం ప్రకాశకులు.. విద్యార్థులను ఆక్వేరియంలో చేపల వలె కాకుండా సముద్రంలో చేపల వలె పెంచాలి.. తెలంగాణ బాలోత్సవం పిల్లల పట్ల బాధ్యతను తన భుజాలపై వేసుకుంది.. బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీస్తోంది..” అని తెలంగాణ బాలోత్సవ ముగింపు సభలో వ్యక్తలు అన్నారు. తెలంగాణ బాలోత్సవం ముగింపు సంబురాలు శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇస్రో చంద్రయాన్‌ ప్రాంగణంలో ముగిశాయి. బాలోత్సవ కార్యక్రమానికి 102 పాఠశాలల నుంచి 6000 మంది విద్యార్థులు హాజరయ్యారు. 200 మంది ఉపాధ్యాయులు, 70 మంది న్యాయ నిర్ణేతలతో, 108 మంది వాలంటీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలోత్సవ ముగింపు సంబురాలు జరిగాయి. బతుకమ్మ, దాండియా, సైన్స్‌ ప్రదర్శన, కోలాటంతోపాటు చిన్నారులు వ్యర్థాలకు అర్థాలను వెతికారు. సైన్స్‌ ప్రదర్శనతో అబ్బురపరిచారు. దక్కన్‌ పత్రికా ఎడిటర్‌, ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల చైర్మెన్‌ వేదకుమార్‌, భారత్‌ విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్‌, తెలంగాణ బాలోత్సవ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వేదకుమార్‌ మాట్లాడుతూ.. సరదాగా సందడిగా తెలంగాణ బాలోత్సవంలో పిల్లల పండుగ జరిగిందన్నారు. బాలోత్సవ పిల్లల ప్రపంచం ఎంతో ఉత్తేజం ఉత్సాహం నింపిందని తెలిపారు. ఎక్కడ పిల్లల కోసం ఆలోచిస్తారో అక్కడే మానవత్వం వెల్లివెరుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కాస్త సమయాన్ని కేటాయించాలని, అలా కేటాయిస్తే ప్రపంచం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుస్తుందని చెప్పారు. వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. పిల్లలు స్వయం ప్రకాశకులు అని.. నేలకు అందాలను మోసుకొస్తారని.. గాలికి సుగంధాన్ని అద్దుతారని అన్నారు. కలలు గన్న ప్రపంచాన్ని రంగురంగుల బొమ్మలుగా మలుస్తారని.. చూసిన జీవితాన్ని కథలుగా అల్లుతారని.. పిల్లలు చెయ్యలేనిదంటూ ఏదీ ఉండదన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఆకాశాన్ని తాకుతారని తెలిపారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పిల్లల గురించి ఆలోచించడం అంటేనే దేశ భవిష్యత్‌ గురించి ఆలోచించడం అని, మార్పు పిల్లల నుంచే రావాలన్నారు. చిన్నారులకు పుస్తకాలు మాత్రమే కాదని ఆటపాటల్లో నైపుణ్యం పెంపొందించాలని కోరారు. శాస్త్రీయ ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, అటువంటి ఆలోచనల నుంచి వచ్చింది తెలంగాణ బాలోత్సవం అన్నారు. బాలల పట్ల బాధ్యతను తెలంగాణ బాలోత్సవం తన భుజానపై వేసుకొని చిట్టి బుర్రల్లో దాగున్న సృజనాత్మకను వెలికి తీసే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మట్టి ముద్దలను సైతం ముద్దు ముద్దు బొమ్మలుగా చిన్నారులు మలుస్తున్నారని, వారికి నచ్చిన అంశంపై ప్రోత్సహించే విధంగా పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ఆడపిల్లలు లేడీ పిల్లల వలే కాకుండా పులి పిల్లల వలే విజృంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవ కార్యదర్శి సోమయ్య, కోశాధికారి బుచ్చిరెడ్డి, సుజావతి, కోయ వెంకటేశ్వర్లు, మమత, రూప, లక్ష్మి, విజ్ఞాన దర్శిని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love