ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి.    దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘‘ బీఆర్ఎస్ కు  వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్‌ చేశాం. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం. బీఆర్ఎస్ లో  వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్‌ చేశాం. ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశాం. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేశాం’’  అని తెలిపారు. ‘‘విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాక్‌ చేశాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో, మూడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేశాం. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్‌ చేశాం. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్‌ చేపట్టాం. మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. బీఆర్ఎస్ నేతల సూచనలతో పలు సెటిల్‌మెంట్లు చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలు సెటిల్‌ చేశాం. రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి భారీగా డబ్బు ,బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లాం’’ అని భుజంగరావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.
Spread the love