రూ.2 లక్షలు తీసుకుంటూ..నాలా కన్వర్షన్‌కు ఎకరాకు
రూ. లక్ష చొప్పున రూ.30లక్షల లంచం డిమాండ్
నవతెలంగాణ -శామీర్ పేట
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. బాధితుని నుంచి తహసీల్దార్ డ్రైవర్ నాగేష్ లంచం డబ్బులు తీసుకుని ఆమెకు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి తహసీల్దార్ సుచరిత భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. దాతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కార్యాలయంలో బాధితుని నుంచి తహసీల్దార్ కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని తెలిపారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎమ్మార్వోతోపాటు కీసర ఆర్డీఓ రాజేష్, పలువురు సిబ్బందిని విచారిస్తున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. 2024లో కూడా ఇదే శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ వలలో శామీర్ పేట తహసీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



