
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కుమార్తె నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందారు. మండలం లోని పేరాయిగూడెం పంచాయతీకి చెందిన ఏలేటి ఉషారాణి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలలో కొలువు సంపాదించారు. పాఠశాల విధ్య నుంచి ప్రభుత్వ బడిలో చదివి, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువును సంపాదించారు. పేరాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో 5 వరకు, అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది వరకు చదివి,సత్తుపల్లి లో ఇంటర్ విద్యను అభ్యసించారు.ఉన్నత చదువుల కోసం ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఎం ఎస్సీ సైకియాట్రీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, అసోసియేట్ ప్రొఫెసర్ గా మమత మెడికల్ కాలేజీలోనే పని చేశారు.అక్కడనుండి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్సర్ విభాగం ప్రత్యేక వార్డులో విధులు నిర్వహించారు. ఉషారాణి తండ్రి పేరు ఏలేటి నాగభూషణం అశ్వారావుపేట పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్(జి.పి వర్కర్) గా పని చేస్తున్నారు.తల్లి పార్వతి వ్యవసాయ కూలీ.వీరు తమ పిల్లలు నం ఎంతో కష్టపడి చదివించారు. ఉషారాణి భర్త గద్దల అశోక్ కుమార్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ శాఖలో ఎస్.ఐ కొలువుకు అర్హత పొంది తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నారు. పేదరికంలో ను ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు సాధించిన ఉషారాణి, తల్లి పార్వతి, తండ్రి భూషణం లను పలువురు అభినందిస్తున్నారు.