ఆర్థిక శాస్త్రంలో ఆమెకే నోబెల్‌

She is the Nobel laureate in economics– కార్మిక మార్కెట్‌లో మహిళల ఉత్పాదక శక్తిపై పరిశోధన
స్టాకహేోమ్‌ : ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం అమెరికాకు చెందిన మహిళా ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ను వరిం చింది. కార్మిక మార్కెట్‌లో మహిళల ఉత్పాదక శక్తిపై చేసిన పరిశోధనకు గోల్డిన్‌కు ఈ పురస్కారం ప్రకటిస్తున్నా మని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. గోల్డిన్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. నోబెల్‌ ఆర్థిక పురస్కారాన్ని 1969లో ప్రారంభించినప్పటి నుండీ గోల్డిన్‌తో కలిపి ఇప్పటి వరకూ కేవలం ముగ్గురు మహిళలకు మాత్రమే ఆ బహుమతి దక్కింది. 2009లో ఎలినర్‌ ఓస్ట్రోమ్‌, 2019లో ఎస్తర్‌ డఫ్లో ఈ పురస్కారాలు అందుకున్నారు. కార్మిక మార్కెట్‌లో మహిళల పాత్రపై అవగాహనను పెంచుకునేందుకు గోల్డిన్‌ పరిశోధన దోహదపడుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు ఇది దారి చూపుతుందని స్వీడిష్‌ అకాడమీ అభిప్రాయపడింది. సమస్యకు గోల్డిన్‌ పరిష్కారాలు చూపకపోయినప్పటికీ ఆమె పరిశోధన అందుకు ఉపయోగపడుతుందని తెలిపింది. నూతన, ఆశ్చర్యకరమైన వాస్తవాలను ఆమె ప్రపంచం ముందు ఉంచిందని కొనియాడింది. కార్మిక మార్కెట్‌లో మహిళల అవకాశాలను ప్రభావితం చేసే అంశాలపై లోతైన అవగాహనకు వచ్చేందుకు గోల్డిన్‌ పరిశోధన దోహదపడుతుందని తెలిపింది. ఆమె పరిశోధన కారణంగా భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించిన కార్మిక మార్కెట్లను అర్థం చేసుకోగలిగామని వివరించింది. స్వీడన్‌కు చెందిన ఇంజినీర్‌, శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరిట ప్రకటించిన ఆర్థిక పురస్కారంతో ఈ సంవత్సరపు నోబెల్‌ సీజన్‌ ముగిసింది.

Spread the love